వరదలో కూడా బురద రాజకీయం చేసే పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గోదావరి నది చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదు. 24 లక్షల క్యూసెక్కుల వరద 1986 లో వచ్చిందన్నారు. శాసన మండలిలో ఈ రోజు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 500 ఏళ్లలో రానంత వరద మొన్న వచ్చిందని 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వెల్లడించారు. ఇది ప్రకృతి వైపరిత్యం… తప్ప ఇది మానవతప్పిదం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపులు మునిగితే లక్ష కోట్ల ప్రాజెక్టు మునిగిందని, నాలుగేళ్లు ఇక నీళ్లు రావని తప్పుడు ప్రచారం చేశారన్నారు. డిజైన్ లోపం ఎక్కడా లేదు.. ఇది ప్రకృతి వైపరిత్యం వల్ల ఇది జరిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ లోపల ప్రాజెక్టుకు ఏది జరిగినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఒక్క రూపాయి కూడా మరమ్మతు పనులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వదన్నారు. అన్నారం పంప్ హౌస్ ఈ నెల మూడో వారంలో, మెడిగడ్డ అక్టోబర్ నెలాఖారులోగా ప్రారంభిస్తాం.
యాసంగికి రైతులకు ఎంత నీరు కావాలన్న అందిస్తమని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీ డబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇస్తే, కేంద్ర మంత్రులు మాత్రం ఏం అనుమతులు లేవని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి కాలేదని మొన్న ఓ కేంద్రమంత్రి అన్నారని, డీపీఆర్ లేకపోతే కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చిందని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేగంగా తామే అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు పారలేదని కొందరు అంటున్నారని,.. బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు తానే స్వయంగా తన నియోజకవర్గానికి నీరు వదిలారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read : నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ సవాల్