Heart touching: కొన్ని వార్తలు చదివి తట్టుకోలేము. అలాగని చదవకుండా ఉండనూ లేము. అలాంటి ఒకానొక గుండెలు మెలిపెట్టే వార్త ఇది. చదువుతుంటే కన్నీటి పొర అడ్డొచ్చి అక్షరాలు తడిసి ముద్దయి…కంటి ముందు ఏమీ కనిపించని శూన్యంగా తోచే వార్త ఇది. జీర్ణం చేసుకోవడానికి మనసు అంగీకరించని వార్త ఇది.
చావు- పుట్టుకల గురించి మాట్లాడకూడని పసివాడు చావును అంగీకరించిన విషాదమిది. తనకు వచ్చిన క్యాన్సర్ తనను బతకనివ్వదని ఆరేళ్ల చిన్న పిల్లాడు వైద్యం చేసే పెద్దాయనకు ఇచ్చిన స్పష్టత ఇది. తనను కబళించే మెదడు క్యాన్సర్ గురించి తన తల్లిదండ్రులకు తెలిస్తే తట్టుకోలేరని పిల్లాడు బాధ్యతగా భయపడిన అరుదయిన సందర్భం ఇది. ఆరు నెలలకు మించి బతకనని తనకు తెలిసినా…ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పద్దని వైద్యుడిని వేడుకున్న పసి హృదయం ఇది.
అలాగే…అని ఆ వైద్యుడు మాటిచ్చి…విషయమంతా వారికి చెప్పి…ఏమీ తెలియనట్లు నటించండని…ఆ తల్లిదండ్రులను ప్రాధేయపడ్డ కన్నీటి దృశ్యమిది.
ఆ పిల్లాడు కనుమూశాక…ఈ విషాదాన్ని గుండెల్లో దాచుకోలేక ప్రపంచానికి చెప్పుకున్న వైద్యుడి కథ ఇది.
“ఎన్నడు విజ్ఞానమిక నాకు?
విన్నపమిదె శ్రీ వేంకటనాథా!
బాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు కలిగినన్నాళ్లు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు”
32 వేల కావ్యాలతో సమానమయిన అన్నమయ్య కీర్తనల్లో అనన్యసామాన్యమయిన భక్తి- వేదాంతాన్ని ప్రతిపాదించే కీర్తన ఇది. మాటల్లో వేదాంతం ఎవరయినా చెబుతారు. అదంతా అకెడెమిక్. చేతల్లో వేదాంతం కోటికొక్కరికి కూడా సాధ్యం కాదు.
ఆరేళ్ల పిల్లాడు వైద్యుడికి వేదాంత పాఠం చెప్పాడు. తల్లిదండ్రుల ప్రేమకు తల్లడిల్లి వారిని మాయలో పడేయడానికి తెరపడే తన జీవన నాటకరంగం మీద తాత్కాలికంగా మరో అంతర్నాటకాన్ని రచించాడు. ఐ ప్యాడ్ లో తనను చంపే రోగం చదివిన పిల్లాడు… తన తల్లిదండ్రుల ఆనందమయ క్షణాలను బతికించుకోవడానికి కలలు కన్నాడు.
ఆశ దేహమున్నన్నాళ్లు. కోసినా, బాసినా తొలగవు బంధాలు, కోరికలు. ఒకొటికొకటి ఒడబడని ఎన్నెన్ని విషయాలను ఎంత పరిపక్వతతో ఆలోచించి…వడపోసి…ఎంతటి స్థిర చిత్తంతో…ముగింపును అర్థం చేసుకున్నాడో?
“నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన?
తెలుసా మనసా? నీకిది తెలిసీ అలుసా?
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా?”
తెలిసీ తెలియని ఆశల వయసు వరుస కాదిది.
తెలిసి…తెలిసి…ఈశ్వరుడి తలపును చదివిన పిల్లాడి మనసు ఇది.
(ఎలా రాయాలో…ఏమి రాయకూడదో…తెలియక…ఏదో రాసిన విధిరాత ఇది)
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :

తెలుగు, జర్నలిజం, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో ఇరవై ఏళ్ల పాటు జర్నలిస్టుగా అనుభవం. 15 ఏళ్లుగా మీడియా వ్యాపారం. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, వెబ్ సైట్లలో కాలమిస్టుగా పాతికేళ్ళ అనుభవం.
ఈ వార్త నేను Facebook లో చదివాను. గత వారం paper లో గూడా చదివాను. ఆప్పుడు కేవలం ఒక వార్తా లాగానే చదివాను (ఎలాంటి స్పందన లేకుండా). కానీ మీ యీ వ్యాసం చదువుతుంటే గుండె పిండినట్టవుతుంది.
ఆరేళ్ళ క్రితం మా ప్రియ మిత్రుడు, నా భార్య అన్నయ్య పోయినప్పుడు వెంటనే ఏమి అనిపించలేదు. కానీ మా పాత్రికేయ మిత్రుడొకరు వ్రాసిన సందేశం చదువుతుంటే ఏడుపాపుకోలేక పోయాను.
సాధారణ పాఠకుడు పెద్దగా పట్టించుకోని విషయాన్ని హృదయం కదిలించే విధంగా వ్రాసారు. పాఠకులారా మీకు కూడా మనసుంటుంది. దాన్ని అప్పుడప్పుడూ ఇలా మంచి వ్యాసాలు చదవడం ద్వారా తట్టి లేపాలి అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.