Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపిల్లల అల్లరి అందం

పిల్లల అల్లరి అందం

Bihar judge quotes Lord Krishna ‘butter theft’ tale, acquits boy accused of ‘stealing’ and eating sweets

చిన్ని కృష్ణుడి అల్లరి భక్తి సాహిత్యం నిండా పులకింతగా అల్లుకుని ఉంది. యుగం మారే కొద్దీ వేగం పెరుగుతూ ఉంటుంది. ఆయుస్సు తగ్గుతూ ఉంటుంది. త్రేతాయుగంలో రాముడు మనిషిగా పదకొండు వేల సంవత్సరాలున్నాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 ఏళ్ళే ఉన్నాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు…ఇలా అందరి దగ్గరా ట్యూషన్లు చెప్పించుకుని రాముడు సకల శాస్త్రాలను ఓపికగా, చాలాకాలం పాటు చదివి చదివి…థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు రాసి రాసి…పాసయ్యాడు. కృష్ణుడు సాందీపుడి దగ్గర అరవైనాలుగు రోజుల్లోనే రాముడు చదివిన అంత సిలబస్ ను పూర్తి చేశాడు. అంతా సూపర్ ఫాస్ట్. రోబో చిట్టి 2.0 వర్షన్ కంటే కృష్ణుడు లేటెస్ట్. చదువు, రాజకీయం, యంత్రం, మంత్రం, తంత్రం, మ్యూజిక్, ప్రేమ, బండి తోలడం, అడవుల్లో అవుటింగ్, పశువులు కాచడం, పాలు పితకడం, గ్రూప్ డ్యాన్స్ లు, చిన్నప్పుడే అల్లరి చిల్లరి గ్యాంగులను వెంటేసుకుని తిరగడం, పాలు పెరుగు జున్ను వెన్న మీగడ నేతుల కుండలకు చిల్లులు పెట్టి చాకచక్యంగా దొంగిలించడం, పట్టుబడితే పక్క వాళ్లను ఇరికించి తెలివిగా తప్పించుకోవడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఎదురు తిరిగి…పిల్లలన్నాక అల్లరి చేయరా? అని అల్లరి పనులను సమర్థించుకోవడం…ఇలా చిన్ని కృష్ణుడి అల్లరిని చూసి సర్వసంగ పరిత్యాగులు కూడా మైమరచిపోయారు.చిన్ని కృష్ణుడిలో వెంకన్నను దర్శించిన అన్నమయ్య ఆ బాలకృష్ణుడిని మన తెలుగింటి పిల్లాడిని చేసి ఎత్తుకుని ఆడుకున్నాడు. కాళ్లకు మువ్వల బంగారు పట్టీలు, నడుముకు వడ్డాణం, మెడలో ముత్యాల హారాలు, నెత్తిన నెమలి పింఛం, ఒక చేతిలో వేణువు, మరో చేతిలో దొంగిలించిన వెన్న ముద్ద, నోరంతా పులుముకుకున్న వెన్న, మీగడలు, పొట్ట మీద పాల చారలు, చింతకాయల్లాంటి వంకర్లు తిరిగిన ముంగురులతో యశోద కొంగుపట్టుకుని తిరిగే చిన్ని కృష్ణుడిని చూడ్డానికి అన్నమయ్యకు రెండు కళ్లు చాలలేదు. చిన్ని కృష్ణుడిని, ఆయన అల్లరిని ఎన్ని కీర్తనల్లో ఎంతగా వర్ణించినా అన్నమయ్యకు తనివి తీరినట్లు లేదు.

లీలా శుకుడి కృష్ణ కర్ణామృతం నిజంగా చెవులకు కృష్ణామృతమే.
అమ్మా! జో కొడుతూ కథ చెప్పమ్మా! పడుకుంటా…అనగానే…అనగనగనగా అయోధ్యలో దశరథుడని ఒక రాజు. ఆ రాజు కొడుకు రాముడు. తండ్రికిచ్చిన మాట కోసం అడవికెళితే…రావణుడు సీతను అపహరించాడు…అని యశోద చెబుతోంది. లక్ష్మణా! ధనుర్బాణాలు తీసుకో త్వరగా…అని కృష్ణుడు ఉలిక్కిపడి లేచాడట. ఏమిటో పాపం…పిల్లాడికి పీడకల వచ్చి ఉంటుంది…అనుకుని యశోద థూ…థూ…అని దిష్టి తీసి మళ్లీ పడుకోబెట్టిందట.

బాబూ! నువ్వెక్కువ అల్లరి చేస్తున్నావ్. రాత్రి బూచాళ్లొస్తారు…వారికి పట్టిస్తా…అని యశోద బెదిరిస్తే…చిన్ని కృష్ణుడు తన పొడవాటి జుట్టును కళ్ళమీద వేసుకుని…అమ్మా చీకటిగా ఉంది…బూచాడొచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడా? అని భయం భయంగా అడిగాడట. ఇంత పిరికివాడు…పిచ్చి తండ్రి ఈ పాడు లోకంలో ఎలా బతుకుతాడో? అని యశోద దిగులుపడుతూ కృష్ణుడిని ఎత్తుకుని, హత్తుకుందట.

ఎప్పుడూ ఇంట్లో పాలు వెన్న నెయ్యి మాయమవుతుంటే ఒక గోపిక కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పెద్ద ప్లాన్ వేసింది. ఇంటి గుమ్మం మీద వెన్న కుండ పెట్టి…కృష్ణుడి పక్కన ఉన్న పిల్లల్లో ఒకడికి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ఆమె తడిక వెనుక కన్నంలో నుండి చూస్తోంది. కృష్ణుడు తన బ్యాచ్ మొత్తాన్ని వేసుకుని వచ్చాడు. చిన్ని కృష్ణుడు ఎక్కడయినా, ఎప్పుడయినా ముందు తాను తినడు. అందరికీ ముద్దలు ముద్దలుగా పెట్టి చివర తాను నోట్లో పెట్టుకోబోతుంటే గోపిక పరుగున వచ్చి చేయి పట్టుకుంది.
గోపిక:- నువ్వెవరు?
కృష్ణుడు:- బలరాముడి తమ్ముడిని(అయన్ను లాగాడు సేఫ్టీకి)
గో:- ఇక్కడేమి చేస్తున్నావ్?
కృ:- తప్పిపోయిన మా చిన్ని తెల్ల దూడను వెతుకుతున్నా.
గో:- వెన్న కుండలో చెయి ఎందుకు పెట్టావ్?
కృ:- కుండలో ఏదో తెల్లగా కనపడితే…లోపల దూడ దాక్కుందేమోనని చెయ్ పెట్టా…గట్టిగా అరవకమ్మా…దూడ బెదిరి పారిపోగలదు…
అని కృష్ణుడు అనగానే ఎంత తెగింపు? ఎంత దబాయింపు? అని ఆమె ఆశ్చర్యపోయేలోపు కృష్ణుడు చేయి విదిలించుకుని…వెన్న ముద్ద నోట్లో వేసుకుని…తన గ్యాంగ్ తో హాయిగా వెళ్ళిపోయాడట.
లీలాశుకుడి కృష్ణుడిని చూడడానికి కళ్లకు అదృష్టం ఉండాలి. వినడానికి చెవులకు భాగ్యం ఉండాలి.

మన పోతన పోత పోసిన చిన్ని కృష్ణుడు మన ఇంటి బిడ్డే. ఆవులను తోలుకుంటూ అడవికి వెళ్లి చెట్టు నీడన చుట్టూ గోప బాలురను కూర్చోబెట్టుకుని మధ్యలో తాను కూర్చుని…అందరూ మూటలు విప్పి తెచ్చుకున్న సద్ది అన్నాలు తింటుంటే…కృష్ణుడు వేళ్ల మధ్య ఆవకాయ ముక్కలు పెట్టుకుని… ఒక్కొక్కరి అన్నాన్ని రుచి చూస్తున్నాడట. ఎంగిలి చేత్తోనే వారు కృష్ణుడికి పోటీలు పడి తినిపిస్తున్నారట. చెట్టు చాటు నుండి బ్రహ్మ ఈ సన్నివేశాన్ని చూసి…
ఏలా నాకున్ బ్రహ్మ పదవి? ఈ అడవిలో కృష్ణుడితో ఆడుకుంటున్న ఈ పిల్లల్లో ఒక్కడి పాద ధూళికి కూడా నా బ్రహ్మ పదవి సమానం కాదు…అని గుండెలు బాదుకున్నాడు. సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి ఎవరూ అనువదించకుండా ఆ భాగ్యాన్ని నాకు కలిగించారు అని పోతన వినయంగా చెప్పుకున్నాడు. నిజమే- తెలుగువారి భాగ్యం కొద్దీ భాగవతం పోతన చేతిలో పడింది. పోతన తీర్చి దిద్దిన చిన్ని కృష్ణుడు తెలుగు ఉయ్యాలల్లో ఊగిన మన ఇంటి బిడ్డ. మన చంకలో బిడ్డ. తెలుగు ముద్దులు మూటగట్టిన మురిపాల బిడ్డ.

కృష్ణుడి అల్లరిని అల్లరి అని అనకూడదు. అవి లీలలు. ఒక్కో లీల వెనుక ఒక్కో పరమార్థం దాగి ఉంటుంది. ఆ జగన్నాటక సూత్రధారి లీలలు- వాటి పరమార్థాలు- అందులో తత్వాలు ఇక్కడ అనవసరం.

బీహార్ నలంద చిన్న పిల్లల నేరాల కోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. ఒక పిల్లాడు అమ్మమ్మ ఇంటికి వెళ్లి…అక్కడి బంధువుల ఇంట్లో స్వీట్లు, సెల్ ఫోన్ దొంగిలించాడు. ఈ అబ్బాయే తీసుకెళ్లినట్లు గుర్తించి, పట్టుకుని, కేసు పెట్టారు.

ఏదో…చిన్న

…తెలిసీ తెలియక చేసి ఉంటాడు. చిన్నప్పుడు శ్రీ కృష్ణుడు కూడా చేయలేదా? దీనికి కేసెందుకు? పాపం! వదిలేయండి…అని జువైనల్ కోర్టు నలంద పోలీసులను ఆదేశించింది.

ఇంకా నయం!
ద్వాపర యుగంలో బృందావనంలో పోలీసుల్లేరు. ఉండి ఉంటే…రోజుకు పదిసార్లు యశోద పోలీస్ స్టేషన్ కు, బెయిల్ కోసం నందుడు లాయర్ల దగ్గరికి వెళ్లడానికే సమయం సరిపోయేది!

తప్పిపోయిన తెల్ల లేగ దూడ కోసం వెన్న కుండలో చేయి పెట్టాను…అని చిన్ని కృష్ణుడు అంటే ఆ గోపిక మురిసిపోయింది. నవ్వుకుంది. ఇంకోసారి వస్తే బాగుండు…అని వెన్న కుండను అలాగే పెట్టుకుని…ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది!

అది ద్వాపర.
ఇది కలి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

తెలుగు అకాడెమీలో దొంగలు పడ్డారు

Also Read:

సానుకూల దృక్పథానికి…

Also Read:

కేంద్ర మంత్రికి యూ ట్యూబ్ ఆదాయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్