Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Minister in Modi cabinet earns from YouTube royalty

మాట తూలితే ప్రమాదం. సరిగ్గా వాడితే ఎలాంటి అవకాశాన్నైనా చేజిక్కించుకునే ఓ అవకాశం.

మాట విలువ తెలిసినవాళ్లు దాన్ని పొదుపుగా వాడతారు. మరికొందరు దాని విలువనే ఆసరా చేసుకుని.. మాటల ఆటలతోనే గారడీ చేస్తారు. వక్తృత్వం ఓ కళ. అందుకు అధ్యయనమే ఆయుధం. అయితే అధ్యయనమున్నవారంతా అలా అని మంచి వక్తలు కాలేరు. కానీ మంచి వక్తలయ్యే వారు మాత్రం అధ్యయనం చేసినవారైనప్పుడు… తిరుగులేని మాస్ కమ్యూనికేటర్స్ గా రాణిస్తారు.

బ్యాంక్ అకౌంట్ లేకున్నా సరే… సోషల్ సైట్స్ అకౌంట్స్ లేనివాళ్లను మాత్రం చూడలేని రోజులివి. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ కనిపించని చేతుల దర్శనం కూడా అరుదే. అంతేనా… ఓ స్మార్ట్ ఫోన్, సోషల్ అకౌంట్ ఖాతాలే కాదు… ఫోనున్న ప్రతీ వ్యక్తికీ ఓ యూట్యాబ్ ఛానలూ భాగమైపోయింది.

ప్రపంచం కుగ్రామమై… బెల్జియమైనా, బెర్లినైనా, కరీంనగర్ జిల్లా బెజ్జంకైనా… ఏదైనా జరిగిందంటే క్షణాల్లో తెలిసిపోయే పరిస్థితి. అందులోనూ సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు సంపాదించొచ్చంటే ఆగుతారా…? ఆ ఆశ మనుషులను మరింత పరిగెత్తిస్తోంది. మొత్తంగా పేద, పెద్ద అంతరాళ్లే వాడుకలో ఉంది సోషల్ మీడియా.

రాజకీయాలు, సినిమాలు, క్రీడలు.. ఇలా ఏ రంగంవారైనా సరే! సోషల్ మీడియాతో కనెక్టివిటీ లేదంటే.. ఇప్పుడున్న ప్రపంచంలో వారు అనాగరికులన్నట్టే!! అందుకే ట్విట్టర్, ఇన్ స్టా, ఎఫ్బీ, కూ, లింక్డ్ ఇన్ ఇలా ఏ సోషల్ ఫ్లాట్ ఫాం చూసినా… సామాన్యులెంత ఉత్సుకత చూపిస్తున్నారో.. స్టార్సూ అంతే ఉత్సాహం చూపిస్తున్నారు.

సెలబ్రిటీలను ఆసరా చేసుకుని సోషల్ సైట్స్ లబ్ది పొందుతుంటే… ఆ సైట్స్ వల్లే సెలబ్రిటీలు, స్టార్స్ కు సైడ్ ఇన్ కమ్.. సారీ సారీ కొందరికైతే ఇప్పుడదే ప్రధానాదాయమై కోట్లు కొల్లగొడుతున్నారు.

ఇంతకాలం ఓ కేంద్రమంత్రిగా… ఆర్ఎస్ఎస్ లో కీలకపాత్రధారుడిగా మాత్రమే పరిచయమున్న నితిన్ గడ్కరీ… ఇప్పుడు ఈ కోవలోకి చేరి వార్తల్లో వ్యక్తవ్వడమే ఇదిగో మారుతున్న సామాజిక పరిణామాలకు.. విజ్ఞులు వాటిని వాడుకుంటున్న తీరుకూ ఓ నిలువెత్తు నిదర్శనం.

గడ్కరీకి ట్విట్టర్ లో 92 లక్షల ఫాలోవర్స్.. ఫేస్ బుక్ లో 16 లక్షలు… ఇన్ స్టా లో 13 లక్షలు… యూట్యూబ్ లో రెండు లక్షలు. ఇక ఇప్పుడు చెప్పండి… సోషల్ మీడియాతో అనుసంధానమెందుకు కాకూడదో..? అయితే ఈ ఫాలోయింగ్ అంత ఊరికే రాదండీ.. కాస్తంత కళాపోషణుండాలి… మాటల మరాఠీ అయ్యుండాలి… ఏ సామాజిక ప్రయోజనం కోసమో మాట్లాడినా.. లేక వ్యక్తిగత విషయాల్నే షేర్ చేసుకున్నా.. దానికింత హాస్యచతురత అనే ఫ్లేవర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది.

అవన్నీ చేశాడు కాబట్టే ఇప్పుడు గడ్కరీ ఓ కేంద్ర మంత్రిని మించి వార్తల్లో వ్యక్తయ్యాడు. కోవిడ్ సమయం ఎందరి బతుకుల్నో హృదయవిదారకంగా మార్చేసి కల్చివేస్తే… మరికొందరు మాత్రం కోవిడ్ సమయాన్ని తమకనుకూలంగా మల్చుకున్నారు. అందులో గడ్కరీకీ స్థానముంది. ఏం చేయాలో తోచని స్థితిలో.. మన కేంద్రమంత్రి నలభీముడయ్యాడు. గరిటె తిప్పాడు. ఆ తిప్పిన గరిటె తాలూకు వీడియాలను తన సొంత యూట్యూబ్ ఛానల్ లో పెట్టాడు. తనకున్న జ్ఞానాన్ని… సమకాలీనాంశాలకు జోడించి తనదైన రెగ్యులర్ శైలికి మరింత ఆసక్తికరమైన హాస్యగుళికలను కలిపి ప్రసంగిస్తూ షూట్ చేసిన వీడియాలనూ అప్లోడ్ చేయడం మొదలెట్టాడు.. అలా గడ్కరీ ఓ కేంద్రమంత్రిగా కంటే ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్ గా ఇప్పుడు మన్ననలందుకుంటున్నాడు.

ఇప్పుడీ సచివుడు ఏం చెప్తాడా అని యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలన్న తేడా లేకుండా ఆయన యూట్యూబ్ వీడియోల కోసం నిరీక్షించే పరిస్థితిని క్రియేట్ చేశాడు. ఇంతకీ ఏం మాట్లాడుతాడు గడ్కరీ…? ఎక్కడో గడ్చీరోలీలోని గిరిజన స్థితిగతులపై మాట్లాడుతాడు. ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవేపై తన అభిప్రాయాల్ని కుండబద్ధలు కొడతాడు. పార్లమెంటరీ విధానం.. దానిపై ప్రజలకుండే అభిప్రాయాలపై సెమినార్ లో దంచేస్తాడు. లేదంటే మిషన్ పానీలో అమితాబ్ తో కలిసి నీటిసంరక్షణా పద్ధతులపై చెబుతుంటాడు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ గురించి అనర్గళంగా ఉపన్యసిస్తాడు. ఇలా ఏ రంగంపైనైనా విస్తృతంగా సంపూర్ణమైన అవగాహనతో మాట్లాడగల్గే వాక్చాతుర్యం, నైపుణ్యమే… గడ్కరీని యూట్యూబ్ స్టార్ గా కూడా తీర్చిదిద్దాయి.

ఢిల్లీ, నాగ్ పూర్ ల నుంచి ఒక్కోరోజు సుమారు ఏడెనిమిది వెబినార్లలో పాల్గొంటూ క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు మన గడ్కరీ. అవి కరోనా తీవ్రమవుతున్న రోజులు.. 2020 ఏప్రిలో 1వ తేదీ నుంచి ఇలా తను మాట్లాడే ప్రతీ అంశాన్నీ వీడియోలుగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో… అవి అంతే వైరలవుతూ గడ్కరీని ఓవర్ నైట్ స్టార్ ని చేశాయి.

సుమారు ఇప్పటివరకూ 1500 వెబినార్లలో పాల్గొన్నాడు గడ్కరీ. మొట్టమొదట డీమానిటైజేషన్ తో ప్రారంభించిన ప్రసంగం బాగా సక్సెస్సవ్వడంతో… తన సోషల్ వీడియో లెక్చర్స్ ని కంటిన్యూ చేస్తున్నారు ఈ కేంద్రమంత్రి. అందుకే ఈ కేంద్రమంత్రి ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు నిర్వహించే వెబినార్లలోనూ పాల్గొంటుండగా… ఈయన ఆత్మనిర్భర్ భారత్ పై ప్రసంగించిన వీడియోలపై నాగ్ పూర్ కు చెందిన జర్నలిస్టులు కొందరు అన్ మాస్కింగ్ ఇండియా పేరిట ఓ పుస్తకమే తేనున్నారట! అదండీ మన గడ్కరీ సంగతి… మాట విలువ సంగతి!!

మాట తూలుతూ రోజూ ఇబ్బందులు కొనితెచ్చుకునేవారినీ చూస్తుంటాం.. ఇదిగో మాటలతోనే ఎందరో అభిమానాన్ని చూరగొని.. పైసలుగా కూడా మార్చుకునే గడ్కరీలాంటి వారినీ చూస్తున్నాం. ఇక తూలుతారో… చక్కగా వాడుతారో..? ఇక మీదే నిర్ణయం!

-రమణ కొంటికర్ల

Also Read: 

అమరత్వం కోసం కుబేరుల ఆరాటం

Also Read: 

పరభాషా పారిభాషిక పదాలు

Also Read: 

జీ తెర మరుగు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com