Friday, April 19, 2024
HomeTrending Newsఅనుచిత వ్యాఖ్యలు తగదు: హరీష్ రావు

అనుచిత వ్యాఖ్యలు తగదు: హరీష్ రావు

సిఎం కేసియర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈటెల రాజేందర్ కు తగదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హితవు పలికారు. ఈటెలకు టిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలుగా సాయం చేసిందని, సిఎం కెసియార్ వల్లే ఈటెల రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని, క్యాబినెట్ లో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించారని, అలాంటి కేసీయార్ పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. జమ్మికుంటలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈటెల చేస్తున్న విమర్శలు ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈటెల తన తమ్ముడు లాంటి వాడని నాడు కెసియార్ చెప్పారని, కానీ ఈటెల మాత్రం అదే కేసిఆర్ కు గోరీ కడతాం అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి మంత్రులు మాత్రం దేశంలో ఎక్కడైనా ప్రచారం చేయవచ్చు గానీ, తాను మాత్రం హుజూరాబాద్ లో ప్రచారం చేయకూడడా అంటూ హరీష్ ప్రశ్నించారు. ఈటెల ఇన్నేళ్ళలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నియోజకవర్గంలో నిర్మించలేకపోయారని, హుజూరాబాద్ లో గెల్లు  శ్రీనివాస్ గెలుస్తారని, ఆ తర్వాత నియోజకవర్గంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.

ఒసీల్లో ఉండే పేదలకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కెసియార్ కే దక్కుతుందన్నారు.  అర్యవైశ్యులకు పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులిచ్చామని, ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని హరీష్ రావు  హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్