Could humans become immortal in our lifetimes?
మొత్తం 34 మంది.
వయసు 64 ఏళ్ళు.
రోజుకు 90 నిముషాలు.
వారానికి అయిదు రోజులు.
మూడు నెలలపాటు వీరికి హైపర్ బరిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫలితం? వారి వయసు తగ్గి 25 ఏళ్ళ వారి చురుకుతనం వచ్చిందట.
ఆలోచనలు, శక్తి సామర్థ్యాల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయని పరిశోధన నిర్వహించిన ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయినా ఆక్సిజన్ థెరపీ జీవితకాలం పెంచుతుందని మన యోగులు ఎప్పుడో నిరూపించారు. ఏ ఖర్చూ లేకుండా ప్రాణాయామం చేస్తే చాలు. అందుకే భారతీయ యోగాకు అంత ప్రాచుర్యం.
కొన్నేళ్ళక్రితం అంజి అనే సినిమా వచ్చింది. అందులో విలన్ అమరత్వం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంతో ఖర్చుపెడతాడు కూడా. కానీ ఫలితం దక్కదు….సీన్ కట్ చేస్తే జెఫ్ బెజోస్(అమెజాన్ అధిపతి) అనే కుబేరుడు కూడా అదే పని చేశాడు. ఎప్పటికీ వయసు మీదపడకుండా ప్రయోగాలు చేస్తున్న అమెరికాకు చెందిన ఆల్టోస్ లాబ్స్ కు లక్షలాది డాలర్లు సమకూర్చాడు.
ఇతనికన్నా ముందే ఇదే ఆలోచనతో కాలికో లాబ్స్ వారికి గూగుల్ కి చెందిన లారీ పేజ్ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాడు. ఫలితం తెలీదు. మరో పక్క ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ వారు తాము ఇప్పటికే ఫలితాలు సాధించామంటున్నారు .
Hyperbaric Oxygen treatmentఅసలిది ఎలా సాధ్యం? అంటే మానవ క్రోమోజోముల చివర ఉండే టెలిమెర్ అనే భాగాన్ని నియంత్రిస్తే సాధ్యమే అంటున్నారు. అందులో భాగంగా హై ప్రెజర్ ఆక్సిజన్ ఛాంబర్లో పెట్టారు. ఫలితంగా మార్పులు సాధ్యమయ్యాయంటున్నారు. మరోపక్క ఆల్టోస్ లాబ్స్ పరిశోధకులు శరీరకణాల పునర్విభజన ద్వారా ప్రయోగశాల లో కొత్త కణాలు సృష్టించవచ్చని, శరీరంలోని కణాలను కావలసిన రీతిలో మార్చవచ్చని చెప్తున్నారు. అదే జరిగితే 50 నుంచి ఎన్నేళ్ళైనా జీవితకాలం పెంచవచ్చంటున్నారు.
ఎంత కాలమెంత కాలం?అంటే కాలమాగిపోనీ అన్నట్టు ఈ సంపన్నులు తమ ధనం ఎందుకు ఇటువంటి వాటిపైన పెడుతున్నారు? పెరుగుట విరుగుట కొరకే అని వీరికి తెలీదా? అసలు మరణం లేకుండా జనాభా పెరిగిపోతుంటే వచ్చే సమస్యల మాటేమిటి? ఇదంతా ఊహించే 18 వ శతాబ్దంలో థామస్ రాబర్ట్ మల్థూస్ ఒక సిద్దాంతం ప్రతిపాదించాడు. దాని ప్రకారం మానవులలో పునరుత్పత్తి, ఆహార వినియోగం తక్కువగా ఉండాలి. అప్పుడే భూమి పైన, సహజ వనరుల పైన భారం తగ్గుతుంది. కానీ ఆశపోతు మానవులు అన్ని వ్యవస్థలూ ధ్వంసం చేస్తూ తాము మాత్రం చిరంజీవులు కావాలనుకుంటున్నారు.
ప్రకృతితో ఆటలాడితే ఏమవుతుందో కరోనా ద్వారా చూస్తూనే ఉన్నాం. ఏ ప్రయోగమైనా భూమికి భారంగా మారకూడదు. జనన మరణాలు సహజ ప్రక్రియలు. వాటి జోలికి పోకుండా అసమానతలు లేని ఆరోగ్య ప్రపంచాన్ని సృష్టించడానికి ఆధునిక కుబేరులు కృషి చేయాలి. వారికి అటువంటి సద్బుద్ధి కలగాలని కోరుకుందాం.
-కె. శోభ
Also Read:
Also Read:
Also Read:

జర్నలిజం, మేనేజ్ మెంట్, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో డిప్లొమా. ప్రింట్ మీడియాలో పదేళ్ల అనుభవం. కాలమిస్టుగా, ఫ్యామిలీ కౌన్సిలర్ గా పదేళ్ల అనుభవం