Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్

దా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్

People don’t buy goods and services, they buy relations,
stories and magic -Seth Godin

సబ్బమ్మడానికి సంస్కారం గురించి మాట్లాడతారు.
సర్ఫ్ అమ్మడానికి సాయం గురించి చూపిస్తారు.
మద్యం అమ్మడానికి మగబుద్ధి గురించి చర్చిస్తారు.
అవసరానికి వస్తువులు మాత్రమే అమ్మే రోజులు పోయాయి.

ఇప్పుడు అనుభూతుల్ని అమ్మాలి.
అనుబంధాల్ని అమ్మాలి.
అనుభవాల్ని అమ్మాలి.
కొత్త ఆలోచనని అమ్మాలి.
మొత్తంగా ఒక అవసరాన్నే అమ్మాలి.

దీనికి తగ్గట్టే అడ్వర్టయిజ్ మెంట్లు కూడా తయారవ్వాలి.
వస్తువుదేముంది? ఎలాగూ అమ్ముతారు.
కానీ మనం కొనేది కేవలం ఆ వస్తువే కాదని మనకి అనిపించాలి.
పదిరూపాయలిచ్చి ఒక్క సబ్బే కాదు..
సినీతారల సౌందర్యం కూడా కొనేస్తాం.
వందరూపాయలతో సిమ్ కార్డే కాదు…
సకలస్నేహాలూ మన సొంతమవుతాయి..
చెరిపినా చెరగని మార్కర్, మాంగాల్యాన్ని కూడా నిలబెట్టేస్తుంది.
టీపొడికి ట్రాన్స్ జెండర్ని ప్రేమించడానికి లింక్ వుంటుంది.
ఒక ధోతీ కొంటే, జాతి పితకి చేతులెత్తి మొక్కినట్టే.

కొన్ని ప్రకటనలు కవితాత్మకంగా ఉంటాయి.
కొన్ని ప్రతీకాత్మకంగా వుంటాయి.
కొన్ని కథలు చెప్తాయి.
కొన్ని చర్చను రేపుతాయి.
కొన్ని తెలిసో తెలియకో వివాదాన్ని సృష్టిస్తాయి.
ఏంచేసినా ప్రకటన లక్ష్యం ఒకటే..
పదిమందిలో ప్రస్తావనకి రావాలి.

ఒక్కోసారి ప్రకటనలు అర్థం లేనవనిపిస్తాయి.
కొన్ని అసంబద్ధంగా అనిపిస్తాయి.
కొన్ని బాగా అతిగా వుంటాయి.
ఏం చేసైనా జనం నోళ్లలో నానితే పనయినట్టే.
సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా సరుకు గుర్తురావాలి.
ఇప్పడు ఈ సందర్భాలు సృష్టించడమే ప్రకటనకర్తల అసలు టాస్క్ అయిపోయింది.

పెళ్లి బట్టలు అమ్మే ప్రకటనలో బట్టల గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
అందులో అభ్యుదయచర్చ పెట్టాడు.
కన్యాదానం కాదు, కన్యమానం అని ఏదో (పిచ్చి)ప్రయోగం చేసాడు.
పెళ్లంటే అమ్మాయిని దానమిచ్చేయడమా అని ప్రశ్నలు లేవనెత్తాడు.
ఇదంతా ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అని తెలిసిన వాళ్ళూ, తెలియని వాళ్లూ కూడా దీని చుట్టూ మూగారు.

Manyavar’s ‘Kanyadaan’ ad featuring Alia Bhatt stirs controversyహిందూ ఆచారలని, సనాతన సంప్రదాయాలను ప్రశ్నిస్తారా అని అటువైపు ఆవేశపడిపోతున్నారు.
నో.. ఇది ప్రగతిశీల భావజాలం..దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదని
ఇటువైపు అడ్డం పడిపోతున్నారు.
ఒక టీవీచానెల్ లో రంగనాయకమ్మ అన్నట్టు, ఇందులో ప్రగతిశీలత లేదు., పాడూలేదు.
హిందూమతాన్ని ప్రశ్నించేంత సాహసమూ లేదు.
దాన్ తీసి మాన్ పెట్టినంత మాత్రాన మహిళల్ని ఆ ప్రకటన ఉద్ధరించిందీ లేదు.

మొత్తంగా ఈ రచ్చతో ఆ ప్రకటన లక్ష్యం నెరవేరింది.
మామూలుగా చూసే దానికంటే పది రెట్లు ఎక్కువ మంది ఇప్పుడు ఆ ప్రకటన చూసారు.
ఆ బ్రాండ్ ని చూసారు.
ఆ వస్తువు గురించి తెలుసుకున్నారు.

ఆ ప్రకటనలో నటించిన హీరోయిన్ కి మరో పది కోట్లు మార్కెట్ పెరిగింది.
యాడ్ మేకర్ ఆశించిన మేజిక్ జరిగింది.
కంపెనీ వాడికి కావల్సిన ప్రచారం వచ్చింది.
మీడియాకి కావల్సిన మసాలా దొరికింది.
కంగనా అండ్ బ్యాచ్ కి కాలక్షపం కుదిరింది.

– శివ

Also Read:

బుల్లెట్ బండెక్కి వత్తా పా

Also Read:

అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక

Also Read:

స్వయంభువును నేను

RELATED ARTICLES

Most Popular

న్యూస్