Saturday, January 18, 2025
HomeTrending Newsయూరోప్ దేశాల్లో మండే ఎండలు

యూరోప్ దేశాల్లో మండే ఎండలు

యూరప్‌ ఖండం అగ్నిగోళంగా మారింది. హీట్‌ వేవ్‌కు పశ్చిమ,దక్షిణ యూరప్‌ లోని దేశాలు అల్లాడిపోతున్నాయి. లండన్‌ సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హీట్‌వేవ్‌తో పోర్చుగల్‌ అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్‌ ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వేలాది మంది ఇళ్లలో ఉండలేక పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. వడగాలులు వీస్తుండడంతో బ్రిటన్‌ వాతావరణ విభాగం తొలిసారి రెడ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. లండన్‌తోపాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాలపాటు ఇదేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేషనల్‌ ఎమర్జన్సీ ప్రకటించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మేల్కొనకపోతే ముప్పు తప్పదని, పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు ఇచ్చింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా యూరప్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. దంచి కొడుతున్న ఎండలతో యూరప్‌ దేశాలు అల్లాడిపోతున్నాయి. వేడిగాలులు సెగలు రేపుతున్నాయ్. బ్రిటన్‌ చరిత్రలో తొలిసారి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతుండటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని బ్రిటన్‌ వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఇటువంటి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి.

అధిక ఉష్ణోగ్రతల ప్రభావం విద్యుత్‌, వాటర్‌ సప్లై, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులపై పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బ్రిటన్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది. ఈ పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులైన వారు కూడా అనారోగ్యం బారినపడవచ్చని.. మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న బ్రిటన్‌ వాసులు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. అటు పశ్చిమ యూరప్‌లో కని వినీ ఎరుగని విధంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులకు పోర్చుగల్‌, స్పెయిన్‌లు ఉడికిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా గ్లొబల్‌ వార్మింగ్‌పై చాలా ఏళ్లుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. దీనికోసం అనేక ఒప్పందాలు కూడా జరిగాయి. కర్బన ఉద్గారాలు తగ్గించి, భూతాపాన్ని నియంత్రించాలనే వాదనలు అనేకం ఉన్నాయి. సదస్సుల్లో మాటలు చెప్పటం తప్ప, వాస్తవంలో పర్యావరణం కోసం ఏ దేశమూ జాగ్రత్తలు తీసుకోని పరిస్థితి ఉంది. దాని ఫలితంగా అకాల వర్షాలు, అంతులేని ఎండలు, వడగాలులు పెరుగుతున్నాయి. ఇప్పుడు యూరప్‌ లో కనిపిస్తున్న పరిణామాలు ఆసియా దేశాల్లో చాలా కాలంగా కనిపిస్తున్నవే. ముఖ్యంగా భారత్‌ లో మండే ఎండలు, వరదలు చాలా కాలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌ దేశాల్లో కూడా సమ్మర్‌ పేరు చెప్తే వణికిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్