Sunday, January 19, 2025
HomeTrending Newsపశ్చిమ బెంగాల్లో హింసాత్మకంగా పోలింగ్

పశ్చిమ బెంగాల్లో హింసాత్మకంగా పోలింగ్

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ – బిజెపి ల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతోంది. జేనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ANI స్ట్రింగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లతో కొట్టుకుంటున్న సమయంలో ఆ దృశ్యాలను ఏఎన్‌ఐ స్ట్రింగర్‌ బంటీ ముఖర్జి తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక రాయి వచ్చి ముఖర్జి తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. దాంతో ఎన్నికల అధికారులు అతడిని హుటాహుటిన కోల్‌కతాలోని మెడికా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలింగ్‌ ప్రారంభానికి ముందే స్థానికులు గుంపులుగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చి ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. రెండు వీవీ ప్యాట్‌ మిషన్‌లను పోలింగ్‌ కేంద్రం పక్కన చెరువులో పడేశారు.

జాదవ్‌పూర్‌ నియోజకవర్గంలోని భాంగర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్)‌, సీపీఐ (ఎం) మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు గాయాలపాలైనట్లు సమాచారం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుల్తాలిలోని మేరీగంజ్‌లోని బూత్ నంబర్ 40, 41లో జరిగింది. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో కొందరు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ మెషీన్లను ఎత్తుకెళ్లి.. దగ్గర్లోని నీటి కుంటలో పడేశారు. గత ఏడాది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అక్రమార్కులు బ్యాలెట్ బాక్సులను నీటిలో పడేయడం గమనార్హం.

సిపిఎం హయంలో జరిగిన ఘోరాలు తిరిగి తృణముల్ ఏలుబడిలో పునరావృతం అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిఎంసికి పట్టు ఉన్న ప్రాంతాల్లో వోటింగ్ లో ఏ మాత్రం తేడా కనిపించినా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

విద్యావంతులు, సంస్కరణవాదుల జన్మభూమి పశ్చిమ బెంగాల్లో నేడు రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికార, విపక్ష నేతలు ఎదురు పడితే హింస తప్పదనే స్థాయికి బెంగాల్ రాజకీయాలు దిగజారాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్