Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

Dasaratha & Rama: దశరథుడు అయోధ్యను నిర్నిరోధంగా పాలించింది అక్షరాలా అరవై వేల ఏళ్లు. దశరథుడు ఎంత బలవంతుడంటే…యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి తన రథంతో నేరుగా దేవేంద్రుడి దగ్గరికే వెళ్లి…పని ముగించుకుని తిరిగి అదే రథంలో భూమ్మీద సరయూ తీరంలో అయోధ్యకు దిగిరాగలడు. అంతటి దశరథుడి కొడుకు రాముడు. సర్వ సంపదలు. సకల విద్యలు. అడుగడుగునా సేవకులు. వంటవాళ్లు. బాడీ గార్డ్స్. ఒకటా? రెండా? అనుభవించడానికి రాముడి ముందు లేని వైభోగం లేదు. అయినా అయోధ్య అంతఃపురంలో అతి చిన్న ఉద్యోగితో కూడా రాముడు నవ్వుతూ మాట్లాడతాడట. ఎవరితో అయినా ముందు తనే మాట్లాడతాడట. ఎవరయినా ఒక సహాయం చేస్తే వారెదురుపడిన ప్రతిసారి కృతజ్ఞతతో మాట్లాడతాడట. ఎవరయినా అపకారం చేస్తే పొరపాటున కూడా తలచుకోడట. సర్వం సహా చక్రవర్తి కొడుకు అన్న గర్వం కానీ, కాబోయే రాజు అన్న అహంకారం కానీ రాముడిలో వీసమెత్తు కూడా ఉండదు. ఒక సాధారణ పౌరుడిలా, విద్యార్థిలా, కొడుకుగా రాముడి వినయం ముందు ఎవరయినా పిపీలికాలే.


మాట ఇచ్చి…తప్పుతావా? అని విశ్వామిత్రుడు అయోధ్య నిండు కొలువులో దశరథుడిని నిలదీస్తే…పరిస్థితిని పక్కనున్న వశిష్ఠుడు చక్కదిద్ది…రాముడెవరో మనకు తెలుసు…ఆయనకు పుత్రవాత్సల్యం కదా! అని సర్ది చెప్తాడు. విశ్వామిత్రుడు అడిగినట్లు ఆయన వెంట రాముడిని రాక్షససంహారం కోసం పంపుతాడు. మొదటి రోజు పని అయ్యాక విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు అన్న మాట…మేము మీ కింకరులం…మీరు ఏ పని చెప్తే…ఆ పని చేయమని మా నాన్నగారి ఆదేశం…చెప్పండి…ఈ రోజు మా డ్యూటీ ఏమిటి? అని. తాటకిని భలే కొట్టావే అని విశ్వామిత్రుడు రాముడిని టెస్ట్ చేస్తాడు. మీ ఆజ్ఞ…నాదేముంది? అంటాడు రాముడు. విశ్వామిత్రుడు పొంగిపోతాడు. తను వేల ఏళ్లు తపస్సు చేసి పొందిన అతి బల మహాబల అస్త్ర శస్త్ర విద్యలు, ఉపసంహార మంత్రాలు అన్నిటిని రామలక్ష్మణులకు ధారపోస్తాడు. మరుసటిరోజు మారీచ సుబాహుల మీద ఒకే రకం బాణం వేసినా…సుబాహు చస్తాడు. మారీచుడు స్పృహదప్పి పడతాడు. వాడితో మునుముందు ఇంకా చాలా పని ఉందికదా! రామబాణానికి లెక్కలు చాలా ఉంటాయి.

విశ్వామిత్రుడు అడిగి రాముడిని తీసుకెళ్లింది రాక్షససంహారం కోసం. కానీ ఆ పని అయి యజ్ఞం పూర్తయ్యాక మిథిలకు తీసుకెళ్లాడు. అదేమిటి గురువుగారూ! వర్క్ ఆర్డర్ కాంట్రాక్ట్ ప్రకారం మీ పని అయిపోయాక మమ్మల్ను రిలీవ్ చేయాలి. మేము వెంటనే వెళ్లి నెట్లో ఆహా చూసి ఓహో అనాలి…అని అనలేదు. మిథిలలో శివధనువు చూపించినప్పుడు కూడా గురువుగారూ! ఈ ధనస్సును నేను పట్టుకోవచ్చా? అని వినయంగా రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు. అలాగే నాయనా అని ఆయన పర్మిషన్ ఇచ్చాకే వింటినారికి అల్లె తాడు కట్టబోయాడు. అది ఫెళ్ళుమని మధ్యకు రెండుగా విరిగింది. అక్కడున్నవారి గుండెలు గుభిల్లుమన్నాయి. జనని జానకి ఒళ్లు జల్లుమని పులకించింది. వెంటనే జనకుడు బంగారు పాత్రలో నీళ్లు తెచ్చి కాళ్లు కడిగి…కన్యాదానం చేయబోయాడు. విల్లు విరచడం వరకే నా పని. మిగతా ఫార్మాలిటీస్ మా నాన్న మాట్లాడాలి…అన్నాడు రాముడు. అప్పటికప్పుడు జనకుడు మిథిలనుండి రథం మీద అయోధ్యకు మెసెంజర్లను పంపితే…విషయం తెలిసి అయోధ్య నుండి దశరథుడు వచ్చేసరికి వారం పట్టింది. తీరా ఆ పెళ్లి జరిగి అంతా సుఖంగా ఉండగా మంథరా ప్రేరిత కైకేయి ఎప్పటివో రెండు పాత బ్లాంక్ చెక్ వరాలను వాడుకుని రాముడికి వనవాసం ప్రసాదించింది. ఈ సందర్భంలోనే దశరథుడు కుళ్లి కుళ్లి ఏడుస్తూ నా రాముడు నా మాట వినని వాడయితే ఎంత బాగుండేది అని స్పృహదప్పి పడిపోయాడు. రామా రామా! అంటూ ఆ పలవరింతలోనే పోయాడు.

రాముడు అవతారపురుషుడు అని తెలిసినవారికి తెలుసు. తెలియనివారికి తెలియదు. మనిషిగా పుట్టి, మనిషిని గెలిపించినవాడు రాముడు. మనం రామాయణాన్ని పూజిస్తాం. పారాయణ చేస్తాం. రాముడు పాటించిన విలువలు, ఆదర్శాలను పాటిస్తామో లేదో కానీ వాటిని కూడా పూజిస్తాం. మంత్రాలుగా పఠిస్తాం. వేనోళ్ల పొగుడుతాం.

మిన్ను విరిగి మీద పడ్డా ధర్మం తప్పని రాముడు.
తన మన తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూసిన రాముడు.
మాట మీద నిలబడే రాముడు.
కష్టాలను ఇష్టంగా దీక్షగా స్వీకరించిన రాముడు.
ధర్మం పోతపోసిన రాముడు.
రాముడిని పొగడడానికి మాటలు చాలవు.
Political Leaders Rude Behavior

కట్ చేస్తే…
రాముడినుండి నేరుగా ఆధునిక కాలంలోకి వద్దాం. తండ్రి ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, ఇతర హోదాల్లో ఉంటే వారి పిల్లలు సర్వం సహా చక్రవర్తులకంటే గొప్పవారయి ఉంటారు. లేదా గొప్పవారని తమకు తాము అనుకుంటూ ఉంటారు.

ఒక పుత్రరత్నం రోజూ జిమ్ముకు వెళ్లడానికి ఒక కారు, డ్రైవరు, గన్ మెన్. ఇక ఈ పుత్రుడు ఎలా పెరిగి పెద్దవాడై ఏయే పెద్ద పెద్ద పనులు చేస్తాడో ఎవరి ఊహ ప్రకారం వారే ఊహించుకోవచ్చు.

ఒక కొడుకు చదువు మధ్యలో ఆపాడో, లేక ఆగిందో లేక ఈయనకు చదువు చెప్పే కాలేజీలు పుట్టలేదో? చదువుకునే తన ఈడు ఫ్రెండ్స్ ను చెడిపేయడంలో ఈయన ఎప్పుడూ బిజీగా ఉంటాడు.

ఒక నాయకుడి కొడుకు. రియలెస్టేట్ సెటిల్ మెంట్లలో అందె వేసిన చేయి. ఈయనకు లేని అలవాటు ఏదో ఇప్పటిదాకా ఎవరూ కనుక్కోలేకపోయారు.

ఒక నాయకుడి కొడుకు విదేశంలో బాగానే సంపాదించేవాడు. తండ్రికి పెద్ద పదవి రావడంతో విదేశం నుండి శాశ్వతంగా వచ్చేశాడు. ఇప్పుడతను ఎన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడో అతడికే తెలియడం లేదు. చేత్తో నోట్లు లెక్కపెట్టలేక వాళ్ల ఆఫీసులో మనీ కౌంటింగ్ మెషీన్లు పెట్టుకున్నారు.

ఒక పుత్ర రత్నం. సినీ హీరోయిన్ల పరిశ్రమలో పాలుపంచుకుంటూ ఉంటాడు.

ఒక పుత్ర రత్నం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాసినోల్లో తిరుగుతూ ఉంటాడు.

ఒక పుత్ర రత్నం లేస్తే తాగుతాడు. తాగితే పడుకుంటాడు.

ఇంకా చాలా మంది పుత్రులు చాలా వ్యవహారాల్లో మునిగి ఉంటారు. సభా మర్యాద దృష్ట్యా అవన్నీ ఇక్కడ అనవసరం.

బుద్ధిగా ఉన్న పుత్రులు ఉండరని కాదు. ఉన్నా…వారు మైనారిటీ అయి ఉంటారు.


గన్ మెన్లు, కాన్వాయ్, ప్రోటోకాల్, గెస్ట్ హౌస్ లు, క్యాంప్ ఆఫీసులు, రాచ కార్యాలు, రాత్రి పనులు, కాంట్రాక్టులు, సెటిల్ మెంట్లు, బ్లాక్- వైట్లు, వ్యవస్థలన్నీ తలవంచి సలాములు చేసే అధికారం, కళ్లు నెత్తికెక్కే సందర్భాలు, కాలు నేల మీద నిలువనీయని అవకాశాలు…కలగలిసి…కొందరు పుత్రుల అరాచకానికి వనంలో మృగాలు సిగ్గుపడుతాయి. మనుషుల మనసులు బూడిదవుతాయి.

వావి వరుసలు మరచిన మానవ మృగాల మధ్య బతకాల్సింది మనమా? వనమా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నిరీక్షణ రామాయణం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్