Friday, March 6, 2026
HomeTrending Newsపార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు షాక్

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు షాక్

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. అనర్హతపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని… నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని స్పష్టం చేసింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని  హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్‌ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ , ఇతరులు ఏప్రిల్‌ 24న హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సుదీర్గంగా విచారణ జరిపింది.

బీఆర్‌ఎస్‌ తరఫున శాసనసభ్యులుగా గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇరుపక్షాల వాదనలు ఆగష్టు 7వ తేదిన పూర్తయ్యాయి. ఈ రోజు తీర్పు వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు… విచారణ ఎప్పుడు జరుపుతారు… ఎప్పటివరకు వాదనలు వినాలి… ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలనే అంశాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హెచ్చరించింది.

హైకోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి తయారైంది. బీఆర్ఎస్ నుంచి మెజారిటీ సభ్యులు పార్టీలోకి రాని దృష్ట్యా నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. అలా కాదనుకుంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించి తిరిగి పోటీకి దింపాలి. అలా చేస్తే ఎంతమంది తిరిగి గెలుస్తారో తెలియని అయోమయ రాజకీయ వాతావరణం నెలకొంది.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular