రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామాతో ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సిఎం ఖాతరు చేయటం లేదని.. సిఎం వైఖరితో అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయని మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో హిమాచల్ సీఎం పదవికి సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు సుఖ్వీందర్ సింగ్ పంపారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలను సిఎం సుఖ్విందర్ ఖండించారు. తను రాజీనామా చేయలేదని.. తమ పార్టీ బలనిరుపణలో నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిని మారిస్తే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతామని.. లేదంటే తమ దారి తమదేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. సంక్షోభాన్ని గాడిలో పెట్టేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా మాజీ సిఎం భూపిందర్ సింగ్ హుడా షిమ్లా చేరుకున్నారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో ఏడాదిన్నర పూర్తికాక ముందే సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కాంగ్రెస్ ఎమ్మల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకునే చాన్స్ ఉంది.
బిజెపి కంటే ఆరుగురు సభ్యుల బలం అధికంగా ఉన్నప్పటికీ రాజ్యసభ అభ్యర్ధిని కాంగ్రెస్ గెలిపించుకోలేకపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బిజెపి అభ్యర్ధికి ఓటు వేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
అటు సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. తాజా పరిణామాలను విశ్లేషిస్తే హిమాచల్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీపై కాకుండా.. సిఎం మీద అసంతృప్తి వ్యక్తం చేయటం కొంత సానుకూల అంశంగా చెప్పవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-25కు పరిమితమై.. కాంగ్రెస్- 40 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు.. బీజేపీలో చేరితే.. కమలం బలం 34కు చేరుతుంది.
బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. నినాదాలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. బహిష్కరణా..? సస్పెండా..? అనే విషయంలో స్పష్టత లేదు.
బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరణకు గురైతే సభా బలం 53కు చేరుతుంది. అప్పుడు మేజిక్ ఫిగర్ 27 అవుతుంది. బలపరీక్షలో కాంగ్రెస్ సులభంగా గట్టెక్కుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌కు గురైతే సభా బలం 68గానే ఉంటుంది. మేజిక్ ఫిగర్ 35. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ బలం 34కు పడిపోయి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది.
-దేశవేని భాస్కర్