Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉత్తర- దక్షిణాలు

ఉత్తర- దక్షిణాలు

Arts & Language: దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం.

హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి– అంతే. కాకపోతే దేశ జనాభాలో 43 శాతం మంది హిందీ మాట్లాడేవారున్నారు కాబట్టి…హిందీ జాతీయ భాష అని చాలా మంది పొరబడుతూ ఉంటారు. హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలు వరుసగా బెంగాలీ, మరాఠీ, తెలుగు.

కొన్ని విషయాల్లో ఎక్కడో స్విచ్ వేస్తే…బల్బ్ ఎక్కడో వెలుగుతూ ఉంటుంది. హిందీని జాతీయ భాషగా ప్రకటించి, గౌరవించి, దేశ ప్రజలందరూ హిందీ నేర్చుకోవాలని ఆ మధ్య హోమ్ మంత్రి అమిత్ షా బల్ల గుద్ది మరీ చెప్పారు. అమిత్ షా ప్రతి మాట వెనుక ఒక దీర్ఘకాల వ్యూహం ఉంటుంది.

దక్షిణాదిలో ప్రత్యేకించి తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఏళ్లతరబడి ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాలు అమిత్ షాకు తెలుసు. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా తెలుసు. ఒక్క నిముషం వీడియోతో సామాజిక మాధ్యమాల వ్యాప్తి సాక్షిగా దేశం తగలబడే రోజులివి. ఇలాంటి వేళ అమిత్ షా భాషాభిమాన ఉద్యమాలకు- దురభిమాన విద్వేషాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారో గమనించాలి. హిందీని జాతీయ భాషగా ప్రకటించాలన్న ఆయన ప్రతిపాదన రెండంచుల కత్తి. తెగినా, తెగకపోయినా, లక్ష్యం సిద్ధించినా, సిద్ధించకపోయినా ఫలితం మాత్రం బి జె పి కే వస్తుంది.

దక్షిణాదిలో హిందీని ఎంతగా వ్యతిరేకిస్తే ఉత్తరాదిలో బి జె పి కి అంతగా ఉపయోగపడుతుంది. అయ్యో పాపం! మా మంచి ప్రభువులు హిందీని అధికారిక దేశ భాష చేయబోతే…ఈ దుర్మార్గ దక్షిణాది రాక్షసులు పడనివ్వట్లేదు…అని భావోద్వేగ అంశంగా మలచి…రాజకీయంగా లాభపడవచ్చు. ఒకవేళ నిజంగానే అయితే…సగానికి పైగా దేశం వద్దంటున్నా…ధైర్యంగా చేశారని మార్కులు కొట్టేయవచ్చు. ఏమి జరిగినా ఇందులో అమిత్ షాకు, బి జె పి కి రాజకీయంగా లాభమే లాభం.

నిజమే.
అజయ్ దేవగన్ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అమాయకత్వాన్ని కాసేపు భరించి...హిందీ జాతీయ భాష అయ్యిందనే అనుకుందాం. దేశంలో మిగతా 57 శాతం ప్రజలు మాట్లాడే ప్రాంతీయ భాషలను నెమ్మదిగా చంపేస్తారా? బతికి ఉన్నా పాడె కడతారా? హిందీ తప్ప ఇక ఏ భాషను మాట్లాడనివ్వరా? మాట్లాడినా వినకుండా చెవులు మూసుకుంటారా?

ప్రపంచ భజన సంప్రదాయాన్ని జనమార్గం పట్టించిన మరాఠీ అభంగాల అందచందాలు చూడలేరా?
వేదాలతో సమానంగా నిలిచే తమిళ నయనారుల, ఆళ్వారుల పత్తికాలు వినలేరా?
భారతీయ సాహిత్యానికి మణిదీపాల వెలుగులను పంచిన మలయాళ మలయ మారుతాల పులకింతలు వద్దా?
మరాఠీ భజనల కొనసాగింపుగా కన్నడలో జనసామాన్యులను చేరిన దాస సాహిత్య ఇక్షు సాగరంలో మునకలు వేసి…కనీసం ఒక చుక్క తీపిని నాలుక మీద రుచి చూడలేరా?


అయోధ్య రాముడే మురిసిన రామదాసు, త్యాగయ్యల తెలుగు కీర్తనల గంగా ప్రవాహంలో మునిగి పునీతులు కాలేరా? పోతన పోతపోసిన కృష్ణతత్త్వం తెలుసుకోలేరా?

ప్రపంచం పట్టనంత బెంగాలీ సాహిత్యం రుచి చూడడానికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి?
సీతమ్మ పుట్టింటి మిథిలవాసులు మాట్లాడే మైథిలీ భాష జానపదగాథల రామాయణం వినలేమా?
మంగళూరు తీరంలో కోటి మందికి పైగా మాట్లాడుతున్నా లిపిలేదు కాబట్టి తుళు భాషనే రద్దు చూసేద్దామా?
ఎగిరి గంతులేసే పంజాబీ కాళ్లు విరగ్గొడదామా?
ఒరియా ఒద్దా?
ఇంకా అనేకానేక భారతీయ భాషల అందచందాల ముక్కు చెవులు కోసి, కాళ్లు చేతులు విరగ్గొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మూలన పడేద్దామా? భాషలు నవనవోన్మేషంగా బతికి ఉండగానే తలకొరివి పెడదామా?

చెప్పండి!
భాషా జ్ఞానం మూర్తీభవించిన అజయ్ దేవగన్ గారూ!
ఇన్ని భారతీయ భాషలను, ఆ భాషలను మాట్లాడే 57 శాతం మంది జనాన్ని ఏం చేద్దాం?

భాషల కడుపు మంటకు జెలుసెల్ పని చేయదు. తెలుగు బాహుబలి హిందీ బాంబే టాకీస్ ను సవాలు చేసింది. తెలుగు పుష్పం హిందీ జడల్లో అలంకారమయ్యింది. కన్నడ కే జి ఎఫ్ హిందీ బంగారు గనులను తవ్వుతోంది.

మీది అసూయ అయితే…
ఆ భగవంతుడు మిమ్ము రక్షించుగాక!

Languages

మీది అజ్ఞానమయితే…
ఈ దేశంలో ఏ భాషలు ఎంతమంది మాట్లాడుతున్నారో గూగుల్ మీకు చెప్పుగాక!

మీది అహంకారమయితే…
ప్రాంతీయ భాషల ఔన్నత్యం ఆ అహంకారాన్ని తగ్గించుగాక!

మీది కుట్ర అయితే…
మీ వేలితో మీ కంటినే పొడుచుకుంటున్నారన్న ఎరుక కలుగుగాక!

ఇవేమీ కాకపొతే…
మర్యాదగా నోరు మూసుకుందురుగాక!

 

సున్ రహా హైనా తు?
దేవగన్!

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:  

సెలెబ్రిటీల సామాజిక నిస్పృహ

ఇవి కూడా చదవండి: 

హిందీపై ‘అమిత’ప్రేమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్