Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందీపై 'అమిత'ప్రేమ

హిందీపై ‘అమిత’ప్రేమ

Language Politics: ఒక దేశం – ఒకే చట్టం అంటే ఏంటో అనుకున్నారు కానీ అందులో ఒక దేశం – ఒకే భాష అంతర్భాగమన్నమాట. నేను తెలుగు భాషాభిమానినే కానీ , తెలుగు పండితుడినికాను . హిందీ వ్యతిరేకిని అసలు కాను .

విజయవాడలో హిందీగాలులు ఎక్కడ వీచాయోగానీ మా ఆవిడ హిందీమీద స్వారీ చేస్తూ ఉంటుంది . హైదరాబాద్ గాలివల్ల మావాడు కూడా హిందీతో బాగానే ఆడుకుంటాడు . ఏటొచ్చి…నా హిందీనే సానుభూతితో అర్థం చేసుకుని …అర్థంకాక నా ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకుని చాలామంది ఓదారుస్తూ ఉంటారు . కొంతమందిమాత్రం నా హిందీ తెగింపుకు భయపడుతుంటారు . రాయలసీమలో హిందీ వాడుక మా ఇంటా లేదు , వంటలో అసలు ఉండదు . రాయలసీమలో ముస్లిములు మాట్లాడే హిందీ అందచందాలు , దాని వ్యాకరణం , దాని ఉచ్చారణ దానికదిగా నిజంగా ఒక భాష . అది వినాలి , మాటల్లో చెప్పలేము . చిన్నయసూరి లాంటి వారెవరయినా
దానికి వ్యాకరణం రాసి ఉండాల్సింది .

Language

హైదరాబాద్ హిందీ గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పేదేముంది ?

ఇక రాజమండ్రి , విశాఖల్లో ముస్లిములు మాట్లాడే ఉర్దు నన్నయ్య తెలుగుకు ఏమాత్రం తక్కువ కాని శుద్ధభాష .

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే హిందీలో ఇన్ని మాండలికాలు , వైవిధ్యాలు లేదా హిందీ అనుకుంటూ స్థానిక ఆవిష్కరణ అయిన ఉర్దూ లేదా ఉర్దూ అనుకుంటూ మాట్లాడే ఒకానొక భాష ఉపయోగిస్తుంటే – దేశమంతా ఒకే హిందీ – ఎప్పటికి రావాలి ?

హిందీమీద ”అమిత”ప్రేమ ఉండక్కర్లేదు – అలాగని హిందీమీద అమితద్వేషమూ అక్కర్లేదు . ఈరోజుల్లో మాతృభాష ఏదయినా ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవాలి . హిందీ తోడయితే మంచిది . భాషను బలవంతంగా రుద్దితే వాంతి అవుతుంది . ఇష్టపడి ఎవరికివారు నేర్చుకుంటే వాగ్ భూషణమవుతుంది .]

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఘటనాఘటనా సమర్థుడు అని లోకానికి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బుర్ర నిద్రలో కూడా మెలకువగా ఉంటుంది కాబట్టే ప్రధాని మోడీకి అంతగా నచ్చి ఉంటారు అని కూడా కొత్తగా కనుక్కున్నదేమీ కాదు. భారతదేశంలో గుర్తించిన అధికార భాషలున్నాయి కానీ…జాతీయ భాష లేదు. హిందీని జాతీయ భాషగా చేయాలని అమిత్ షాకు ఎప్పటి నుండో ఒక ఆలోచన ఉంది. ఆయన బుర్రలో ఒక ఆలోచన వస్తే…ఎక్కడో స్విచ్ వేస్తే…ఎక్కడో బల్బ్ వెలిగినట్లు...ఆ ఆలోచనకు ఇతరేతర లెక్కలు…వ్యూహాలేవో ఉంటాయి.

ఉత్తర భారత హిందీ బెల్ట్ లో హిందీ జాతీయ భాష అన్న చర్చను ఒక భావోద్వేగ అంశంగా మలచాలని పావులు కదుపుతున్నట్లున్నారు. నిజాం పాలనవల్ల తెలంగాణాలో తప్ప దక్షిణాది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో సహజంగా హిందీ మీద అంత పట్టింపు ఉండదు. తమిళనాడు, కేరళలో హిందీని లెక్కపెట్టరు. తమిళనాడులో దశాబ్దాలపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగాయి. అత్యంత జాగ్రత్తగా ఎత్తుగడలు వేసే అమిత్ షా కు ఇవన్నీ తెలియక కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఒక అంకెల ఆట. ఆ ఆటలో ఓట్లు ఒక వేట. ఆ వేటలో భావోద్వేగ అంశాలు ఒక ఎర. ఆ ఎరలో హిందీ జాతీయ భాష అంశం ఒక అర. అమిత్ షా ఒరలో ఇంకా ఎన్నెన్ని అరలు దాగి ఉన్నాయో హిందీ భాష ఏమి చెప్పగలదు?

సబ్ ఠీక్ హై?
సబ్ కా సాథ్…సబ్ కా హిందీ?

హిందీమే ఇండియా నహీ హై ;
ఇండియామే హిందీ హై ;
యహీ ఇండియామే ఔర్ కుచ్ అనేక్ భాషాభీ హై .
హై హై హై – హా – హో – హోగా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

పరభాషలతో మెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్