Monday, June 8, 2026
HomeTrending Newsసేవే అసలైన మతం: వెంకయ్య

సేవే అసలైన మతం: వెంకయ్య

మాతృ భాషా పరిరక్షణ, గ్రామీణ వికాసం, సేవ, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, దివ్యాంగులకు అవసరమైన శిక్షణ, ఉపాధి అందించడం లక్ష్యాలుగా నేటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న స్వచ్చంద సేవా సంస్థ స్వర్ణభారత్ ట్రస్ట్. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వెంకటాచలం కేంద్రంగా స్థాపించిన ఈ నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలకు వెంకయ్య నాయుడుతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో.. సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పారు. “స్వర్ణభారత్‌ ట్రస్టును పరిశీలించాలని చాలా మందిని ఆహ్వానిస్తుంటా. ఏ పదవిలో ఉన్నా ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటా. స్వర్ణభారత్‌ ట్రస్టు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఉంది. తెలుగు భాష రక్షణ కోసం ట్రస్టు ప్రయత్నిస్తోంది. గ్రామీణ మహిళలకు ఒకేషనల్‌ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చాం. దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నాం. అన్నదాతలైన రైతులపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలు. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలి. వారికి తగినంత ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే నా ఆకాంక్ష. మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది” అని వెంకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, ట్రస్టీ డా.కామినేని శ్రీనివాస్ తదితరులు కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular