South Africa Won: మహిళల టి 20 వరల్డ్ కప్ లో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. నేడు హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై 6 పరుగులతో విజయం సాధించి తొలిసారి టైటిల్ రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి తమ జట్టు చేసిన 162 పరుగులను కాపాడడంలో ప్రోటీస్ బౌలర్లు ఆయబొంగా ఖాక, షబ్నిం ఇస్మాయిల్ అద్భుత ప్రతిభ చాటి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. ఖాక 18వ ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం మూడు పరుగులే ఇచ్చింది. ఈ ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హిదర్ నైట్ విజయం కోసం చివరివరకూ పోరాడినా, చివరి ఓవర్ మూడో బంతికి ఆమె ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు.
కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ప్రోటీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు ఓపెనర్లు 96 పరుగులు జోడించారు. వోల్వార్ద్ట్ 44 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్ తో 53; టాజ్మిన్ బ్రిట్స్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యారు. మారిజాన్నే కాప్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 27 రన్స్ సాధించి నాటౌట్ గా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ మూడు; కాథరిన్ స్కివర్ ఒక వికెట్ పడగొట్టారు.
తొలి వికెట్ కు 53 పరుగులు జోడించిన ఇంగ్లాండ్ అదే స్కోరు వద్ద మరో వికెట్ కూడా కోల్పోయింది. సోఫియా డంక్లీ 16 బంతుల్లో 6 ఫోర్లతో 28 రన్స్ చేయగా, ఆలీస్ కాప్సీ డకౌట్ అయ్యింది. 30 బంతుల్లో 6 ఫోర్లతో 34 రన్స్ చేసిన డానియెల్ వ్యాట్ పెవిలియన్ చేరింది. నటాలి స్కివర్ బ్రంట్-40; కెప్టెన్ నైట్-31 పరుగులతో రాణించారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది.
సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక 4; ఇస్మాయిల్ 3; నాడిన్ డి క్లార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
68 పరుగులతో పాటు నాలుగు కీలక క్యాచ్ లు పట్టిన టాజ్మిన్ బ్రిట్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.