Saturday, January 18, 2025

పేద భారతం

The rise of Adani: మొన్నామధ్య పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రెండు భారత దేశాలున్నాయని చెప్పారు. ఒక్కో సెకనుకు కోట్లలో సంపాదించే అత్యంత సంపన్నుల భారతం ఒకటి. ఒక్కో రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించలేని అత్యంత నిరుపేదల భారతం మరొకటి. మోడీ ప్రభుత్వం అత్యంత ధనవంతులను ఇంకా ధనవంతులను చేస్తూ ఉంటుందని, అత్యంత నిరుపేదలను ఇంకా నిరుపేదలుగా మారుస్తూ ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. తొలిసారి రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగం జనంలోకి వెళ్లింది. దీనికి రాజ్యసభలో మోడీ కౌంటర్ ఇవ్వబోయే అగర్ కాంగ్రెస్ న హోతీ అని మొదలు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పెప్పర్ స్ప్రే, అర్ధరాత్రి మూసుకున్న పార్లమెంటు తలుపులు అని ప్రత్యర్థులకు దొరికిపోయారు.

సంపన్నులు అత్యంత సంపన్నులు కావడంలో కాంగ్రెస్ పాత్ర కూడా తక్కువేమీ కాదు. కాకపోతే కాంగ్రెస్ హయాములో పైనుండి కింది వరకు ఆ సంపదను అందరూ ఎలాగో పంచుకుంటూ ఉంటారు. డబ్బు చలామణిలో ఉండి అందరి చేతుల్లో డబ్బులు ఆడేవి. ఇది అదానీ- అంబానీల ప్రభుత్వమని రాహుల్ పార్లమెంటు సాక్షిగా విమర్శించారు.

కరోనా వేళ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి లాక్ డౌన్లు ఉన్నా…వలస కార్మికులను సొంత ఊళ్లకు వెళ్లేలా ప్రోత్సహించాయని మోడీ విమర్శించారు. అలా వెళ్లిన కార్మికులు ఎంత మందో చెప్పలేని నో డేటా అవైలబుల్- ఎన్ డి ఏ ప్రభుత్వమిది అని కాంగ్రెస్ చిదంబరం ప్రతి విమర్శ చేశారు.

అదానీ- అంబానీల కోసమే కేంద్రం పని చేస్తోందన్న ప్రతిసారీ అదానీ- అంబానీలు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండి ఉంటారు. ప్రతిపక్షాలు చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల జాతీయ, అంతర్జాతీయంగా వారి పరపతి పెరుగుతుందే కానీ…తగ్గదు. వారిని ఇంతగా విమర్శిస్తున్న కాంగ్రెస్ రేప్పొద్దున కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఎలా మనుగడ సాగించాలో అదానీ- అంబానీలకు ఒకరు చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖను ఏ ముఖేష్ కోసం అర్జంటుగా మార్చాల్సి వచ్చిందో లోకానికి తెలుసు. చట్టాలెప్పుడయినా కలవారి చుట్టాలు; లేనివారికి చట్టుబండలే అవుతాయి.

రాజకీయాల్లో గెలిచే గుర్రాలను గుర్తించి వాటిమీద పందెం కాయడం పారిశ్రామికవేత్తలు అనాదిగా చేస్తున్నదే. అలా గుజరాత్ ముఖ్యమంత్రి మోడీలో అదానీ భావి ప్రధానిని దర్శించగలిగారు. అందుకే మోడీ కూడా ఎలాంటి దాపరికల్లేకుండా అహ్మదాబాద్ కు వీడ్కోలు చెప్పి అదానీ విమానంలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

వ్యాపారంలో చట్టబద్ధత, ధర్మబద్ధత, నైతికత వేరు వేరు అంశాలు. అదానీ– అంబానీల వ్యాపారాలన్నీ చట్టప్రకారం జరుగుతున్నవే. ధర్మం, నైతికత, ఆదర్శాలు, అభ్యుదయాలు, విలువలు సాపేక్షకమయినవి. ఎవరి ధర్మం వారిది. ఎవరి విలువలు వారివి. ఆ కోణంలో ఇప్పుడు అదానీ ధర్మం నడుస్తోంది. ఆయనకు కాలం యాదృచ్చికంగా కలిసి రాలేదు. ప్రయత్నపూర్వకంగా కాలం కలిసొచ్చేలా చేసుకున్నారు. అదానీ మీద అసూయ పడడం కంటే…అదానీని చూసి నేర్చుకుంటే మంచిది.

అదానీని గమనించి అత్యంత సంపన్నులు కావాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నేర్చుకోతగ్గ సూత్రాలు:

దూరదృష్టి
చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద టార్గెట్లు ఉన్నవారు పెద్దవారు కాబోయే చిన్నవారిని లేదా ఇంకా పెరిగి అతి పెద్ద అవుతారనుకునే ఒక మోస్తరు పెద్దవారిని పసిగట్టి వారిమీద పెట్టుబడి పెట్టాలి.

రాజకీయ అభిప్రాయాలు
వ్యాపారం దానికదిగా ఒక అభిప్రాయం. వ్యాపారానికి ఏ రాజకీయ అభిప్రాయం అనువైనదయితే ఆ అభిప్రాయాన్నే పట్టుకోవాలి.

పట్టుబడి
పట్టుబడడం అన్న మాటకు నెగటివ్ మీనింగ్ ఉన్నా…రాజకీయ పార్టీ మీద పెట్టుబడులు పట్టుబడినా జంక కూడదు.

కుంభస్థలం
సింహం తనకంటే పెద్దదయిన ఏనుగును కొట్టాలనుకున్నప్పుడు మొదట కుంభస్థలం మీదే కొడుతుంది. అందుకే కలలో సింహాలు వచ్చినా ఏనుగు పై ప్రాణాలు పైనే పోతాయి కాబట్టి “సింహస్వప్నం” అంత భయంకరమయిన మాటగా వాడుకలో ఉంది. వ్యాపారంలో అనేక ఏనుగుల కుంభస్థలం మీద కొట్టి పారిశ్రామిక సింహస్వప్నం కావాలి.

జి వి కె పాఠం
దేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలతో పోలిస్తే మన తెలుగువాడు జి వి కె పెద్ద మనిషి. అన్ని వేల కోట్లు ఉన్నవారికి సహజంగా వచ్చి చేరాల్సిన అవలక్షణాలు లేని పాతతరం మనిషి. అల్లరి చిల్లరి వేషాలతో వార్తల్లో ఉండేరకం కాదు. బాంబే విమానాశ్రయాన్ని ప్రయివేటుకు అప్పగించినపుడు ఆ కాంట్రాక్టును జి వి కె దక్కించుకుంది. ప్రపంచంలో అగ్రశ్రేణి విమానాశ్రయంగా దాన్ని తీర్చి దిద్దింది. దేశ దేశాలనుండి ప్రయివేటు పెట్టుబడులు, బ్యాంకు రుణాలు తీసుకుని జి వి కె బాంబే విమానాశ్రయాన్ని కళాత్మకంగా కన్నుల పండుగగా నిర్మించింది.

రోజులు గడుస్తున్నాయి. బి జె పి అధికారంలోకి వచ్చింది. అదానీ కన్ను జి వి కె విమానాశ్రయం మీద పడింది. అంతే…రాత్రికి రాత్రి జి వి కె మీద ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్ మెంట్, ఇతరేతర విభాగాలు దాడులు చేశాయి. సత్య హారిశ్చంద్రుడే వ్యాపారం చేసినా లొసుగులు పట్టుకోవాలనుకుంటే సవాలక్ష దొరుకుతాయి. అలా ఒకానొక జి వి కె తప్పు దొరికింది. అంతే…నొక్కేశారు. పిండితార్థం తెలిసిన జి వి కె విమానాశ్రయాన్ని ఏమాత్రం లాభం లేకుండా అదానీకి అప్పగించి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇందులో సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇంకా ఎన్నో జరిగాయి. ఔత్సాహికులు ఎవరికి వారే తెలుసుకోవాల్సిన విషయాలవి.

నిజానికి నేటితరం వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక రంగాల వారికి అదానీ ఒక నిలువెత్తు ఆదర్శం. స్ఫూర్తి. పులకింత. చదవాల్సిన పాఠం. నేర్చుకోవాల్సిన గుణ పాఠం. పాడాల్సిన పల్లవి. అనుసరించాల్సిన అనుపల్లవి. స్మరించాల్సిన చరణం. అసూయపడాల్సిన హిమవన్నగ విగ్రహం.

ఒక్క ఏడాదిలో అదానీ సంపద ఆరు వందల శాతం పెరిగి ఆసియా కుబేరుల లిస్ట్ లో మొదటి స్థానానికి ఎగబాకారన్న వార్త ఒకరకంగా ఆయన్ను, మనల్ను అవమానించేదిగా ఉంది. బహుశా అది ఆరువేల శాతం పెరిగి…భూగోళం కుబేరుల్లో మొదటి స్థానం అయి ఉంటుంది. ఇది అచ్చు తప్పు అయి ఉంటుంది.

Ambani

ఆసియాలో అత్యంత ధనవంతుడు…పద్నాలుగు లోకాల్లో అత్యంత ధనవంతుడు కావడానికి పరిస్థితులు ఇలాగే ఉంటే…మహా అయితే మరో ఏడాది పట్టవచ్చు…అంతే!

అది ఆయన కష్టార్జితం. మనసున్నవారెవరయినా అభినందించాలి…అంతే!

అదానీ భారతంలో మనమున్నందుకు గర్వించాలి…అంతే!

ఇదొక అంతులేని సంపద కథ.

అంతే…అంతే!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : సంక్షోభంలో సంపద పాఠం

RELATED ARTICLES

Most Popular

న్యూస్