Combination of several cultures: ఆర్య- ద్రావిడ వివాదం మీద పమిడికాల్వ మధుసూదన్ “లేని ఆర్యులు ఎలా వచ్చారు?” అని వ్యాసం రాస్తే…దానికి గంగిశెట్టి లక్ష్మీనారాయణ- కోవెల సంతోష్ కుమార్ స్పందన, ప్రతిస్పందనలను రెండో భాగంగా ఐ ధాత్రి ప్రచురించింది. దాని కొనసాగింపుగా కోవెల సంతోష్ కుమార్ లేవనెత్తిన అంశాలకు మళ్లీ గంగిశెట్టి లక్ష్మినారాయణ సుదీర్ఘమయిన వివరణ ఇచ్చారు. అది యథాతథంగా…
ముందుగా మూడు విషయాలు స్పష్టపరుస్తున్నాను.
1. మన వాఙ్మయంలో మీరన్నట్లు ఆర్య శబ్దం జాతిబోధకం కాదు.. మరో అధ్యయనక్షేత్రంలో, మరో భావానికి ఆ మాటను ప్రతీక ప్రాయంగా వాడుకున్నారు.. ద్రావిడ శబ్దం కూడా అలాటిదే… ఆధునిక అధ్యయనక్షేత్రాలు (డిసిప్లిన్స్) రూపుదిద్దుకొంటున్నప్పుడు, లోకంలోని ఇతర శబ్దాలనే, ఇక్కడ ప్రత్యేక సాంకేతికార్థంలో వాడుకోవడం పరిపాటి.. మన సబ్జెక్టుల పేర్లన్నీ అలా వచ్చినవే…ఫిజిక్స్, సైకాలజీ , హిస్టరీ అన్నీ అలాటివే… his story కలిసి హిస్టరీ అయితే, లోకంలో మనం వాడుకొనే సైకాలజీ అనే మాట అర్థం వేరు, సబ్జెక్టుగా దాని అర్థం- పరిధి వేరు. ఇవన్నీ మీకు తెలిసినవే! అలానే ఆర్య -ద్రావిడ శబ్దాలు కూడాను.. మొదటి దానికి రాయల్ ఏషియాటిక్ సొసైటీ పెద్దలు కర్తయితే, రెండోదానికి బిషప్ కాల్డ్వెల్ సంచాలకశ్రీ!
2.రెండువైపులా మిషనరీలే…. అటువారైనా, ఇటువారైనా…
మిషనరీలనగానే, వారివెనకాల ఒక మిషన్ ఉంది, ఉంటుంది..
మత చరిత్రల, లేదా దైవశాస్త్రాల అధ్యయనంలో మిషనరీలు కానీ –సంస్కృతి చరిత్రల, లేదా సాంస్కృతిక నృశాస్త్ర / మానవ సంస్కృతి శాస్త్రాల (కల్చరల్ ఆంథ్రపాలజీ) విషయంలో వారి ప్రస్తావన రాదు. వచ్చినా నామ మాత్రం. అంతకంటే మించి వారిని తీసుకోవటం అనవసరం కూడా!!
3. ఆ దృష్టితో నాకు మ్యాక్స్ ముల్లర్ విషయంలో మీ అంత లోతైన పరిజ్ఞానం లేదు. సీరియస్ తీసుకొని చదివే అవసరం రాలేదు.. సంస్కృత భాషాచరిత్ర విద్యార్థి ని కూడా కాకపోవడంతో ఆయన అవసరం అసలు తారసపడలేదు.. నేను అవసరమై చదివినదల్లా ‘What can India teach us?’.. ఐ.సి.ఎస్.కు సెలెక్టయి భారతదేశానికి వస్తున్న ఏలిక విద్యార్థులకు కేంబ్రిడ్జిలో, భారతదేశం గూర్చి ఇచ్చిన పరిచయ ప్రసంగ పాఠాల సంకలన గ్రంథం. అంతకు మునుపు భారత చరిత్రకారులమని చెప్పుకొని, అక్కడ నానా కంగాళీ మాటల్ని భారత సంస్కృతి గా చెప్పిన అంగిరీజుల జాత్యహంకార దృక్పథాలని తలకిందులు చేస్తూ చెప్పిన ప్రసంగ పాఠాలు.. భారతీయ సంస్కృతి గూర్చి చదువుకొనేవారికి దాన్ని కూడా ఓ మారు అవశ్యం చూడండి అని సలహా ఇస్తుంటాను. పాపమైతే, ఆ శ్రీమన్నారాయణుడు నన్ను మన్నించు గాక.
మీరు చెప్పిన విషయాలపై నా పరిజ్ఞానం అత్యల్పం కాబట్టి , వాటి గురించి నేను ప్రస్తావించను…
అయితే భారతీయ సంస్కృతి విద్యార్థిగా–అందునా భాషాద్వారం నుంచి ఆ మహా భ(భు)వనం లోకి ప్రవేశించే విద్యార్థిగా– నా ఎదురుగ్గా ఉన్న సమస్యలు ఇవి..
(అ) భాష అంటేనే సంస్కృతికి సమగ్ర అభివ్యక్తి! ప్రతి భాష, ఒక ప్రత్యేక సంస్కృతికి సంకేతమే! India is a Linguistic area అంటారు ఎమినో గారు.. భారత దేశంలో ఒకప్పుడు, అంటే పందొమ్మిదో శతాబ్దిలో, పదకొండు వందల చిల్లర భాషలున్నాయని ఓ లెక్కవేశారు. 20 వ శతాబ్దిలో ఆరు వందల చిల్లర (628?) భాషలున్నాయని ఎన్యూమరేట్ చేశారు… కనీసం పదివేల మంది వ్యవహర్తలు మిగిలివుంటే తప్ప ప్రత్యేకభాషగా లెక్కించటానికి కుదరదని, భాషారాజకీయాలతో తల బొప్పికట్టిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలం నాటి, లింగ్విస్టిక్ సర్వే కమిటీ వారు 21 వ శతాబ్ది మొదట వందా పది పై చిలుకు భాషలను లెక్కవేశారు… ఆ గణాంకాలన్నీ మైసూరు CIIL వారి ప్రచురణలో మీకు లభిస్తాయి.. ఆ లెక్కల విషయం మనకెందుకు అని పక్కన పెట్టినా, నికరంగా గుర్తించాల్సిన అంశం ఒకటే:
ఇప్పటికీ భారతదేశంలో శతాధిక వ్యవహర్తలున్న వందా పై చిలుకు భాషలున్నాయి. అంటే 100 పై చిలుకు ప్రత్యేక జాతులున్నాయి. ఇవన్నీ కొత్తగా వలస వచ్చిన జాతులు కాదు. అనాదికాలంలోనే ఇక్కడ దేశీయంగా స్థిరంగా ఉన్న జాతులు. అంటే ఆ అనాదికాలంలో- అప్పుడెప్పుడో- ఒక్కసారిగా వందలాది భాషా సంస్కృతులు ఇక్కడ పుట్టుకు రాలేదు.. ఎక్కడెక్కడ నుంచీనో, ఇక్కడికి తరలి వచ్చిన వారే వారు. ఇక్కడ లభించే ఉత్తమ జీవనానుకూల స్థితులను చూసి, జీవన సంపన్నతను చూసి, ఇక్కడికి తరలి వచ్చి స్థిరపడ్డవారే! అంటే అనాదికాలంలోనే ఈ దేశం బహుళ జాతి సంకీర్ణంగా ఉండడమే కాక వాటి మధ్య క్రమంగా భావైక్యతను పెంచుకొని నిలిచింది.. ఆ వెనకాల ఎన్ని సంఘర్షణలు జరిగినా, వాటిని చరిత్ర జయించింది.
అలా భారతీయ సంస్కృతి అంటేనే వివిధ జాతుల చారిత్రిక- సాంస్కృతిక ఏకీకరణ అనే సూత్రాన్ని చాటుతోంది. ఎడతెగని ఆ ఏకీకరణ సూత్రమే భారతీయ సంస్కృతి జీవనాడి.. Indian culture is characterized by it’s continuous phenomenon of cultural assimilation అని ఒక విద్యార్థిగా నేను గ్రహించిన పాఠం..
అలాటప్పుడు జాతుల వలస అనేది భారతీయ సంస్కృతి చరిత్రలో ఎలా సూడో-ప్రశ్న అవుతుంది? (ఆ వలస ఎటునుంచి ఎటు అనేది మరో పెద్ద ప్రశ్న.)
(ఆ): భాషా శాస్త్ర ప్రాథమిక నియమాల బట్టే వర్గీకరిస్తే ఈ దేశంలో నాలుగు ప్రధాన భాషాకుటుంబాలున్నాయని స్పష్టమవుతున్నది. వాటికి ఈ పేర్లను వాడుకోవటం లోనే సగం దేశీ-పర్దేశీ తికమక చోటుచేసుకుంది.. జాతి ఐక్యత కు పరోక్షంగా నైనా భంగకారి అనుకొన్నప్పుడు, ఆ విభజన నామధేయాలను పక్కన పెడదాం! మరి ఆ నాలుగింటికి ఏం పేర్లు పెడితే సమంజసంగా ఉంటుంది? భాషాధ్యయన క్షేత్రంలో అది తప్పనిసరి మరి!
3. అలాగే శరీర నిర్మాణాలను బట్టి భారతదేశంలోని ప్రజని, మానవ శాస్త్రవేత్తలు నాలుగు ప్రధాన వర్గాలుగా వ్యవహరిస్తారు. వాటికి ఏం పేర్లు పెట్టాలి?… తమాషా ఏమిటంటే ఈ నాలుగు ప్రధాన వర్గాలకు- ఆ నాలుగు భాషా కుటుంబాలకు పూర్తి సాపత్యం కుదురుతున్నది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ వర్గీకరణ నామధేయాలను స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది …!
ఇవి తప్పనిసరిగా జవాబును అన్వేషించుకోవలసిన ప్రశ్నలే!
భారతీయ సంస్కృతి అధ్యయన క్షేత్రంలోకి వచ్చి ఆలోచిస్తారని నమ్మకం..
సబ్జెక్టు సంకేతాలుగా స్థిరపడ్డ వాటి విషయంలో ఇవ్వాళ మూలాలు తవ్వి తలకెత్తుకొని ప్రయోజనం లేదనుకొనే, నిశ్చేతన వర్గానికి చెందిన వాణ్ణి నేను..
(దీనికి కోవెల సంతోష్ కుమార్ సమాధానం రేపు- నాలుగో భాగంలో)