-0.4 C
New York
Thursday, December 7, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చిపుచ్చుకోవడం- శ్రమైక జీవనం

ఇచ్చిపుచ్చుకోవడం- శ్రమైక జీవనం

How to Transform…:  సన్మార్గంలో నడవాల్సిన ఒక వ్యవస్థ దారి తప్పితే అది సమాజానికి చాలా ప్రమాదకరం. అందులోనూ తమ బోధనలు, విలువల కోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక మఠంలో క్రమశిక్షణ కాస్త అదుపు తప్పినా…దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఇలాటి స్థితిని ఎలా మార్చాలి?

చిన్నప్పటి నుంచీ మన పిల్లలకు ఎలాంటి సంస్కారం నేర్పాలి, సమాజంలో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఎలా గౌరవించాలి అనేది స్పష్టంగా తెలియజెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.  ఈ రెండు అంశాలనూ తెలియజెప్పే రెండు కథలను తెలుసుకుందాం…

 అది ఒక బౌద్ధ మఠం. అక్కడి గురువు ఆందోళనలో ఉన్నాడు.  ఒకానొకప్పుడు ఆ మఠం ఎంతో గొప్పగా విలసిల్లుతుండేది. ప్రస్తుతం దాని ప్రతిష్ఠ మసకబారింది. స్థాయి తగ్గి అట్టడుగుకి పడిపోయింది. ఇదే అయన ఆందోళనకు ప్రధాన కారణం. మఠంలోనే భిక్షువులు ఒకర్నొకరు గౌరవించుకోవడం లేదు. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మఠంలోని స్థితిగతులు ఆయన మనసుని నొప్పిస్తున్నాయి.

ఒకరోజు ఆయన తనకన్నా పెద్ద గురువు కోసం వెతుక్కుంటూ బయలుదేరారు. ఆయనను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. ఆ గురువు కాసేపు ఆలోచించి “మీ మఠంలో బుద్దుడే  వచ్చి ఉంటున్నారు. మీరెవరూ ఆయనను పట్టించుకోలేదు. ఆయనను నిర్లక్ష్యం చేశారు. ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వలేదు. మరి అటువంటప్పుడు మఠం స్థాయి దిగజారదా?” అని ప్రశ్నించారు.  ఆయన మాటలు విన్న గురువు కిమ్మనక మఠం చేరుకున్నారు. అక్కడున్న భిక్షువులకు విషయమంతా చెప్పారు. అందరికీ ఆశ్చర్యమేసింది.

ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ తన పక్కవారే బుద్ధుడేమో అనుకుని  వినయవిధేయతలతో మెలిగారు. వారి ప్రవర్తనలో పెనుమార్పు వచ్చింది.  ఐకమత్యం పెరిగింది. నిర్లక్ష్య ధోరణి కించిత్ కూడా లేదు. ఈ ఊహాతీత మార్పుతో కాలక్రమంలో ఆ మఠానికి పూర్వపు వైభవం వచ్చేసింది. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడమన్నది ఎంత ప్రభావం చూపుతుందో ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకోవచ్చు.

పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు:

తన కుమార్తెను సైకిల్ పై స్కూలుకి తీసుకువెళ్ళే ఓ తండ్రి రోజూ ఒక్కో  భిన్నమైన విషయాన్ని కూతురికి  చెప్పేవాడు.  ఏదో ఒక దుకాణం పేరుని చదవమని చెప్పేవాడు.  ఆ షాప్ పేరు కూతురు చదవగానే ఆ దుకాణం గురించి విషయాలు చెప్పేవాడు. ఆ దుకాణంలో జరిగే పనులు, అక్కడి వస్తువులు, తయారు చేసే పద్ధతులు ఇలా అనేక విషయాలు వివరంగా చెప్పేవాడు.

Change The System

ఉదాహరణకు ఓ టీ స్టాల్ అనుకుంటే…. “ఈ టీ కొట్టతను నాకు బాగా పరిచయం. అతనిక్కడ పదేళ్ళుగా ఈకొట్టు నడుపుతున్నాడు. రోజూ ఉదయం అయిదు గంటలకల్లా దుకాణాం తెరుస్తాడు. అందుకోసం అతను నాలుగ్గంటలకే లేచి బయలుదేరి  దుకాణానికి వస్తాడు. రాత్రి పది గంటల వరకూ ఉంటాడు. రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేస్తాడు. ఇందులో మూడొంతులు  అతను నిలబడే ఉంటాడు. నువ్వేమో క్లాసు రూములో కూర్చుని చదువుకుంటావు. నేనేమో ఆఫీసులో కూర్చుని పని చేస్తాను. కానీ అతను కూర్చుని పని చేసే అవకాశం లేదు. నిల్చుంటేనే పనవుతుంది. ప్రత్యేకించి కొన్ని సమయాలలో రద్దీ ఎక్కువ ఉంటుంది. అటువంటి సమయాలో ఎవరినీ ఎక్కువసేపు ఉండనివ్వ కూడదు. చురుగ్గా టీ తయారు చేసి, చకచకా ఇవ్వాలి. అలాగే టీలో రుచి తగ్గకూడదు. బాగుండాలి. లేకుంటే మాటలుపడాలి” అంటూ  అతని రాబడి గురించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి చెబుతుండేవాడు.  మధ్య మధ్యలో ఆ అమ్మాయి రకరకాల ప్రశ్నలు వేస్తుంది. వాటికీ జవాబులిస్తాడు. రోజూ అమ్మాయిని స్కూల్లో దిగబెట్టేలోపు జరిగే తంతు ఇది.

Change The System

ఓరోజు తరగతిలో మాష్టారు పాఠం చెబుతున్న సమయంలో పూలమ్ముకునే వారి గురించి ప్రస్తావన వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి లేచి అందుకు సంబంధించిన విషయాలన్నింటినీ చెప్తూ వచ్చింది. ఆమె చెప్తున్న విషయాలు తోటి విద్యార్థులనేకాక మాష్టారునీ ఆశ్చర్యపరిచాయి. ఆ అమ్మాయి చెప్పిన వాటిలో పువ్వుల వ్యాపారి స్థితిగతులు, పువ్వుల్లో రకాలు, పూలమొక్కలు ఇలా బోలెడు వివరాలున్నాయి.  క్లాసురూములో అందరూ ఆ అమ్మాయిని ప్రశంసించారు. ఆమె తానిలా చెప్పగలగడానికి కారణం మా నాన్నే అని చెప్పుకుంది.

సహజంగా ఆర్థికపరంగా సామాన్యస్థితిలో ఉన్న వారిని మనలో చాలా మంది ఎలాటి మాటలంటామో తెలిసిందేగా… “ఇదిగో సరిగ్గా చదువుకోకపోతే నువ్వూ ఇలా కూలి పనులు చేసి కష్టపడాల్సిందే” అంటాం. అంటే మన పిల్లల్లో ఓ రకమైన భయాన్ని ప్రవేశపెడతాం. కానీ అది భయంతో ఆగిపోతుందా….కాదు, అది ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో వేరేగా చెప్పక్కర్లేదు. పైగా ఆ పనిని తక్కవస్థాయిగా చిత్రీకరించి  చెప్పడం వల్ల కష్టించి జీవించేవారిపట్ల ఓ హేళన భావాన్ని కల్పిస్తాం. వారి విలువను తగ్గిస్తాం.

నిజానికి ఇటువంటి తీరు సరైనదా? కానేకాదు. మన చుట్టూ పలువురు పలు రకాలుగా కష్టించి తమ జీవితాన్ని సాగిస్తుంటారు. వారెలా జీవిస్తున్నారు? ఎదుగుతున్నారో పిల్లలకు చెప్పడం ముఖ్యం.

ఈ భూమ్మీద ఏ బిడ్డయినా మంచి బిడ్డే పుట్టేటప్పుడు !! అయితే తర్వాతి కాలంలో ఆ బిడ్డలు మంచివారయ్యేదీ…దంష్టులయ్యేదీ కన్నతల్లిదండ్రుల పెంపకం తీరుతోనే !!

నేర్చుకుందాం! నేర్పుదాం!!
తెలుసుకుందాం! పంచుకుందాం!!
మంచినే తలుద్దాం! మంచే జరుగుతుందని ఆశిద్దాం!!

– యామిజాల జగదీశ్

Also Read :

గృహ హింస

RELATED ARTICLES

Most Popular

న్యూస్