Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Need of the Hour: దేశ జనాభాలో 35 ఏళ్ళు లోపువారు 63 శాతంగా ఉన్నారు.  18 ఏళ్లకే ఓటు హక్కు ఉందన్న సంగతి తెలిసిందే. 18-35  ఏళ్ళ మధ్య వయసు వారి ఓట్లు, 35 ఏళ్ళు దాటిన వారి ఓట్ల కంటే అధికం.  అలవాటుగా రోజూ వార్తా పత్రికలు చదవడం 35 ఏళ్ళలోపు వారిలో దాదాపుగా కనిపించదు. (కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు మినహాయింపు). వీరు టీవీ న్యూస్ చానెల్స్ కూడా పెద్దగా చూడరు.

తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో స్కూల్, కాలేజీ దశలో సోషల్ సైన్స్ సజీవంగా ఉంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ చదువుల దెబ్బకు సోషల్ స్టడీస్ చచ్చి పోయి ఇరవై ఏళ్లయ్యింది. ఏదో మార్కుల కోసం చదవడం. చరిత్ర, భూగోళం, సివిక్స్, ఎకనామిక్స్ బాగా బోధించే టీచర్లు, లెక్చరర్ లు అరుదుగానే కనిపిస్తారు. సామజికశాస్త్రంలో ఓనమాలు కూడా తెలియని దయనీయ స్థితిలో నేడు అధిక శాతం యూత్… వెరసి పత్రికలు చదవని, సోషల్ స్టడీస్ రాని…. అంటే సామాజిక పరిజ్ఞానంలేని, ఇంగితజ్ఞానం లేని 18-35 ఏజ్ గ్రూప్ చేతుల్లోకి ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది. 

సోషల్ మీడియా ఒక్కటే ఈ ఏజ్ గ్రూప్ కు దిక్సూచి. సోషల్ మీడియాలో ఒక వైపు పరమ చెత్త… మరో వైపు మెయిన్ మీడియా అమ్ముడుపోయి, వెలికితీయని వార్తలు, విశ్లేషణలు… అంటే మంచి. మొత్తంగా చూసుకొంటే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలే అధికం. ఒక పోస్ట్ కు మూలం అంటూ ఉండదు. ఎవరూ బాధ్యత వహించరు. ఎంతటి ఫేక్ వార్త అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.ఫేక్ వార్తలు సృష్టించే ముఠాలు కోకొల్లలు. (వారి ప్రయోజనాలు వారికున్నాయి, అదో సెపరేట్ టాపిక్)

Apps

పత్రికలు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయనేది పాత ట్రెండ్. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాదే నిర్ణయాత్మక పాత్ర. ఈ వాస్తవాన్ని గ్రహించి ముందస్తు ఏర్పాట్లు చేసుకొన్న రాజకీయ పార్టీలే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాయి.  కాస్త ముందూ-వెనుకా… ప్రతి రాజకీయ పార్టీ తన సోషల్ మీడియా బృందాలను ఏర్పాటుచేసుకుంది.  ఆ బృందాలు సహజంగానే ఆ పార్టీ నాయకుల భజనలు చేస్తాయి. వాస్తవాలతో పని లేదు. ‘మన దేశం బ్రిటిష్ వలస పాలన నుంచి ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం నుంచి బైటపడాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలి’ అని రాజా రామ్ మోహన్ రాయ్ మొదలు అంబేద్కర్ దాక ఎంతో మంది మహనీయులు ప్రజల కోసం రాశారు, పత్రికలు, జర్నల్స్ స్థాపించారు.

అసలు ఆధునిక మీడియా పుట్టింది అలాగే ! 1970 నుంచి మీడియా కమర్షియల్ కావడం అంచెలంచెలుగా జరిగింది. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో. మెయిన్ మీడియాను యూత్ పట్టించుకోని నేటి స్థితిలో ప్రజల పక్షాన నిలబడే సోషల్ మీడియా ఇప్పుడు అవసరం.  ఇప్పుడు లేవా? అంటే వున్నాయి, కానీ  యూట్యూబ్ చానెల్స్ అయితే తమకు వ్యూస్ కోసం; వెబ్ సైట్స్ అయితే క్లిక్స్ కోసం; డబ్బెవరికి చేదు?  యూట్యూబ్ చానెల్స్- ఒక పెద్ద వైకుంఠ పాళీ. వ్యూస్ రావాలంటే ప్రమోషన్లు,  వచ్చే రెవెన్యూలో షేర్లు ఇవ్వాలి. అన్నిటికీ మించి గాడిద ఎగిరిందటే వార్త. కాకి ఎగిరిందంటే వార్త ఎట్లా అవుతుంది? అందుకే “షాక్ తింటారు .. అవాక్కయి పోతారు”; “ఇంట్లో కాకి రెట్ట పెట్టుకోండి- డబ్బొస్తుంది”; “ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ కు ఇష్టమైన పొజీషన్ ఏది ?” లాంటి పరమ చెత్త థంబ్ నెయిల్స్.

Apps

ప్రకటనలు కాదు, రాతలే ప్రకటనలు. ప్రజల పక్షాన నిలబడి రాసేవారు-మాట్లాడేవారున్నారు. కానీ నల్లపూసలు అయిపోతున్నారు. అధిక శాతం పెయిడ్ రాతలు. కొత్తగా ఒక మందు వస్తే దానికి మార్కెటింగ్ గా “వాయ్యో-వామ్మో రోగం” అంటూ జనాల్ని భయపెట్టే విషపు రాతలు/ కూతలు;  “కుందేళ్లు తాబేళ్లు వేప చెట్లు .. వీటిలో పెట్టుబడి పెడితే కోట్లు సాధించొచ్చు” “గుయ్ మని సౌండ్ వచ్చే మెషిన్ పెట్టుకొంటే ఎయిడ్స్ లాంటి వ్యాధులు కూడా దగ్గరకు రావు” అని ప్రచారం జరుగుతుంటే “అరేయ్ ఇది ఫేక్” అని ఒక్కరంటే ఒక్కరు చెప్పారా ?  రెవిన్యూ దెబ్బతింటుందని భయం. పిల్లల లోకం సెల్ ఫోన్ దాటికి తల్లడిల్లుతింటే సెల్ ఫోన్ కంపెనీల ప్రకటనలు రావని వాటిని చూసి చూడనట్టే వ్యవహరించే మయా మార్కెటింగ్ ఆధారిత మీడియా.  క్లిక్స్, వ్యూస్ ను పట్టించుకోకుండా సమాజం పక్షాన నిలబడి ముఖ్యంగా 35 ఏళ్ళు లోపు వారిని ఎడ్యుకేట్ చేసే సోషల్ మీడియా నేడు ఎంతో అవసరం.

ఇక్కడో సమస్య ఉంది. ఈ ఏజ్ గ్రూప్ వారికి తెలుగు చదవడం రాదు (అందరికీ కాదు లెండి .. నేను చెబుతున్నది మెజారిటీ సంగతి). చదవడం వచ్చినా చదివే ఓపికలేదు. ఇంగ్లీష్ మీడియం చదువులు. అలాగని ఇంగ్లీష్ వచ్చా? అంటే రాదు. ఒక వ్యాక్యాన్ని అర్థం చేసుకోలేని దౌర్భగ్యం (నేను మళ్ళీ చెబుతున్నాను .. నేను మాట్లాడుతున్నది మెజారిటీ గురించి . అద్భుతంగా ఇంగ్లీష్ లో చదవడం , రాయడం వచ్చిన వారున్నారు).

వీరికి ఏ భాషలో చెప్పాలి? సంకర భాష?

  • అన్నిటికీ మించి నిడివి ఎక్కువైతే చదివే చూసే ఓపిక ఈ తరానికి లేదు. రెండు నిముషాల్లో మొత్తం చెప్పేయాలి. పోనీ చెబితే అర్థం అవుతుందా అంటే అదీ లేదు. లోన్ అప్ వాడి కండిషన్స్ చదవకుండా క్లిక్ చేసి నానా అగచాట్లు పడుతున్న తరం ఇది.
  • ఇన్ని సవాళ్ళను అధిగమించి 35 ఏజ్ గ్రూప్ వారిని ఎడ్యుకేట్ చేసే సోషల్ మీడియా రావాలి.
  • లేకపొతే ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన, రాజకీయ విషయాల్లో సంక్షోభాలు తప్పవు.
  • మరో కోణంలో చెప్పాలంటే ఇంతటి gullible (అచ్చ తెలుగులో చెప్పాలంటే .. తింగరి సన్నాసులు) యూత్ ని దోచుకోవడానికి చైనా రుణయాప్ లు , ఫార్మాసూరులు, రాజకీయ నాయకుల స్మశానం వద్ద రాబందుల్లా కాచుకొని కూర్చున్నారు.

చదవేస్తే ఉన్న మతి పోయింది అని మన పెద్దవారు వీరి గురించే చెప్పారు . చదువుకొన్న వాడికన్నా చైనా యాప్ వాడే మేలు అని పాత సామెతని తిరగరాసుకొని చదువు కోవాల్సిన అవసరం నేడు ఏర్పడింది.

-వాసిరెడ్డి అమర్ నాథ్

Also Read :

ఎన్నికల్లో సోషల్ మీడియా యుద్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com