Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎన్నికల్లో సోషల్ మీడియా యుద్ధం

ఎన్నికల్లో సోషల్ మీడియా యుద్ధం

Digital War: గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాల ఎన్నికల కోసం భారతీయజనతా పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వార్ రూమ్ వ్యవస్థ ఇది-

1. డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులతో ప్రత్యేక బృందం.
2. కంటెంట్ రైటర్లతో ప్రత్యేక బృందం.
3. పదివేల మంది బి జె పి కార్యకర్తలతో అనుసంధానమయిన డిజిటల్ నెట్ వర్క్.
4. యాభై వేల మంది డిజిటల్ వారియర్స్.
5. ఒక్కో డిజిటల్ వారియర్ కింద 150 నుండి 200 మంది సభ్యులుండే విడి విడి వాట్సాప్ గ్రూపులు.
6. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక సాంస్కృతిక బృందాలు.
7. అహ్మదాబాద్ లో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ ఆగకుండా పనిచేసే వార్ రూమ్.

ఇవికాక సర్వేలు చేసే, వ్యూహాలు రచించే ఇతరేతర బృందాలు ఉండనే ఉంటాయి. ఢిల్లీ కేంద్ర కార్యాలయం మానిటరింగ్ ఎలాగూ ఉంటుంది.

సర్వేల ప్రకారం చూసినా…సరికొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను కోత కోస్తూ ద్వితీయ స్థానంలోకి వచ్చిన ఓట్ల చీలిక సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసినా…బీ జె పి కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ను ఆప్ చీపురు ఊడ్చేసినట్లు కనబడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తో సమానంగా ఆప్ ఎదిగినట్లు ఉంది. కాంగ్రెస్- ఆప్ సమానంగా ఉన్న చోట బీ జె పి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.

అనూహ్యంగా పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ కొత్త తరం ప్రచార ధోరణులేమిటో బీ జె పి కి బాగా తెలుసు. వంశపారంపర్య వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించండి అంటూ బీ జె పి కాంగ్రెస్ ను తిడుతున్నప్పుడు…అది ఆటోమెటిగ్గా ఆప్ కు ఉపయోగపడుతోందని బీ జె పి మొదట్లోనే పసిగట్టింది.

గుజరాత్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పేరేమిటో, ఆయన మొహం ఎలా ఉంటుందో మనకంతగా తెలియదు. ప్రధాని మోడీని చూసి ఓట్లేయాల్సిందిగా బీ జె పి గుజరాత్ ఓటర్లను అడుగుతోంది. మోడీ- కేజ్రీవాల్ మధ్య యుద్ధంగా మార్చారు. ఈ వ్యూహం ఈసారికి బాగానే ఉన్నా…ఇప్పుడు ద్వితీయ స్థానం ఎవరికి దక్కుతుందో…వారికి గుజరాత్ మీద పట్టు దొరుకుతుంది. దాంతో వచ్చేసారికి ఆప్ ఇంకా బలంగా నిలబడగలుగుతుంది. కాంగ్రెస్ సహజంగా సోదిలోకి లేకుండా పోతుంది.

అందుకే “ఆ గుజరాత్ మై బనావు చే” ఈ గుజరాత్ ను నేను నిర్మించాను అని మోడీ గుజరాతీలో చెప్పిన మాటనే బీ జె పి ఎన్నికల ప్రచారంలో నినాదంగా మలచుకుంది. ఆప్ ఢిల్లీలో, పంజాబ్ లో ఎలాంటి బూత్ లెవెల్ ప్రచారం చేసిందో తెలుసు కాబట్టి…దానికి విరుగుడుగా బీ జె పి అతిపెద్ద సోషల్ మీడియా నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంది.

కేవలం పాజిటివ్ ప్రచారం మీదే ఆధారపడకుండా…ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద అనేక మీమ్ లు తయారు చేసి ఇలాంటి చీపుళ్లను చీపుర్లతో ఊడ్చి అవతల పారేయండి అని ఆప్ మీద నెగటివ్ ప్రచారానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తోంది.

మోడీ వర్సెస్ రాహుల్ గా ప్రచారం జరగడం వల్ల గతంలో జరిగిన పరాభవాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ కొంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

కమలం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?
మోడీ- అమిత్ షా పుష్ప అంటే ఫైర్!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ప్రజాస్వామ్య ప్రథమా విభక్తి!

Also Read :

ప్రత్యర్థి గెలిస్తే …తానోడుతోందా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్