Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్‌ స్టార్టప్‌ల హవా

హైదరాబాద్‌ స్టార్టప్‌ల హవా

నిధులు ఆకట్టుకోవడంలో హైదరాబాదీ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మరో మూడు సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో ఎడ్యుటెక్‌ కంపెనీ నెక్ట్స్‌ వేవ్‌, అగ్రిటెక్‌ స్టార్టప్‌ సంహితా క్రాఫ్‌కేర్‌ క్లినిక్స్‌లతోపాటు ఐఐఐటీ హైదరాబాద్‌ ఇంక్యూబేటర్‌ ఇందులో ఉన్నాయి. తొలి రెండు సంస్థలు ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ నుంచి నిధులను ఆకర్షించగా..మూడోది స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీం ద్వారా గ్రాంటు పొందింది.

సంహితా క్రాప్‌కేర్‌కు రూ.11.25 కోట్లు
ఒక వినూత్న వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రారంభించిన ఆగ్రిటెక్‌ స్టార్టప్‌ సంస్థ సంహితా క్రాప్‌కేర్‌ క్లినిక్స్‌…టెక్‌స్టార్‌ గ్రూప్‌, క్వాండ్రంట్‌ రిసోర్స్‌ నుంచి సీడ్‌ రౌండ్‌గా 15 లక్షల డాలర్లు (దాదాపు రూ. 11.25 కోట్లు) సంపాదించింది. జగన్‌ చిటిప్రోలు, కళ్యాణ్‌ ఎంజమూరి, డాక్టర్‌ శ్యామ్‌సుందర్‌ రెడ్డిలు 2000వ సంవత్సరంలో నెలకొల్పిన ఈ సంస్థ… రైతులు దిగుబడిని అధికం చేసేందుకు వీలు కల్పించే డిజిటల్‌ ట్రీ హెల్త్‌ ఆడిట్‌ సిస్టమ్‌ను (డీటీహెచ్‌ఏఎస్‌) అభివృద్ధిచేసింది. దీని ద్వారా వ్యవసాయ క్షేత్రంలోని చెట్ల ఆరోగ్య స్థితిగతుల్ని రికార్డు చేస్తుంది. తాము సమీకరించిన డాటా ఆధారంగా దిగుబడిని అధికం చేసుకునేందుకు అవసరమయ్యే సూచనల్ని రైతులకు వ్యవసాయ నిపుణులు ఇవ్వగలుగుతారని సంహితా వ్యవస్థాపకుడు జగన్‌ చిటిప్రోలు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సంత్రాలు, నిమ్మ రైతులపై దృష్టిపెట్టి, 3,500 ఎకరాల్లోని 4 లక్షల చెట్లపై పైలెట్‌ రన్‌ జరిపామన్నారు.

ట్రిపుల్‌ ఐటీ ఇంక్యుబేటర్‌కు రూ.5 కోట్లు
ట్రిపుల్‌ ఐటీ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌… సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీఐఈ)కు స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ నుంచి రూ. 5 కోట్ల నిధులు గ్రాంట్‌గా లభించాయి. తొలిదశలోని టెక్నాలజీ స్టార్టప్‌లు వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు అవసరమైన మద్దతును, సహాయాన్ని సీఐఈ అందిస్తుంది. వచ్చే మూడేండ్లలో ఈ స్కీమ్‌ ద్వారా 20-25 స్టార్టప్‌లకు మద్దతు అందించనున్నట్లు ఐఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీజే నారాయణన్‌ తెలిపారు.

నెక్ట్స్‌ వేవ్‌కు రూ. 21 కోట్లు
ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ అయిన నెక్ట్స్‌ వేవ్‌కు ఒరియోస్‌, బెటర్‌ క్యాపిటల్‌ సినాప్సిస్‌ల నుంచి 28 లక్షల డాలర్ల్ల (దాదాపు రూ. 21 కోట్లు) నిధులు వచ్చాయి. ఐఐటీయన్స్‌ శశాంక్‌ రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెడర్ల, రాహుల్‌ అట్లూరిలు స్థాపించిన ఈ స్టార్టప్‌.. తాజా నిధులను ప్రాడక్ట్‌ డెవలప్‌మెంట్‌, సిబ్బంది నియమకాలకు వినియోగించనుంది. ప్రస్తుతం సంస్థలో 150 మంది పనిచేస్తుండగా, వచ్చే ఏడాదిలోగా ఈ సంఖ్యను 500కు పెంచాలని భావిస్తున్నట్లు ప్రమోటర్లు తెలిపారు.

Also Read : బసవతారకంలో అత్యాధునిక ఆక్సిజన్ కేంద్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్