Tuesday, December 3, 2024
HomeTrending Newsహైడ్రా దూకుడుతో బడా బాబుల్లో గుబులు

హైడ్రా దూకుడుతో బడా బాబుల్లో గుబులు

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణ దారులు, కబ్జాదారుల్లో హైడ్రా దూకుడు హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని ప్రకటించారు.  దానిపై అంతగా చర్చ జరగలేదు. అప్పుడు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. మొదట చిన్నా చితక నిర్మాణాలను పడగొట్టినా ఇప్పుడు పెద్దోళ్ళ అక్రమాలపై హైడ్రా కన్నుపడింది. చెరువుల సమీపంలోని FTL(ఫుల్ ట్యాంక్ లెవెల్)దగ్గర నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.

తెలుగు సిని హీరో నాగార్జునకు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత పనులు హైడ్రా ఈ రోజు (శనివారం) ఉదయం నుంచి కొనసాగిస్తోంది. చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో కన్వెన్షన్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు  వెల్లువెత్తాయి. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. మొత్తం పది ఎకరాలలో విస్తరించిన ఎన్‌ కన్వెన్షన్‌.. 1.12 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించడంతోపాటు 2 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో ఉన్నది.  తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ ఏరియా 29.24 ఎకరాలు ఉన్నది.

కన్వెన్షన్‌కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. అదేవిధంగా కూల్చివేతల చిత్రీకరణకు మీడియాకు అనుమతి లేదంటూ బారికేడ్లతో మూసివేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల సమీపంలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల భవనాల జోలికి వెళ్లని హైడ్రా (HYDRA).. సామాన్యులు, ఇతరుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది.

మొత్తం 10 ఎకరాల్లో విస్తరించిన ఎన్‌ కన్వెన్షన్‌ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. కెసిఆర్ హయంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారని వార్తలు వచ్చినా జరగలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గురుకుల్ సొసైటీ స్థలాల కబ్జా… అక్రమ నిర్మాణాల పేరుతో అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు కూల్చి వేశారు. ఆ తర్వాత క్రమబద్దీకరణ పేరుతో కబ్జాలకు చట్టబద్దత కల్పించారు. అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మాదిరిగానీ.. సిఎం రేవంత్ రెడ్డి కూడా అక్రమ నిర్మాణాలను సహించేది లేదని హెచ్చరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యాచరణ వెనుక మతలబు ఏంటో త్వరలోనే తేలనుంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. ఇందుకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడిందని సమాచారం.

చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న పనికి అందరు సహకరించి హర్షించాల్సిందే. లోగుట్టు ఏదైనా సమాజానికి మేలు చేసే పనులకు ప్రభుత్వం తరపున ఒక అడుగు ముందుకు పడినా.. ఆ తర్వాత కొనసాగుతుంది. ప్రభుత్వంపై విమర్శలు మానుకొని విపక్షాలు మద్దతు ఇస్తే ప్రజాక్షేత్రంలో నిలబడతాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్