కుల రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించలేదని, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే వచ్చామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషుల్లో కులం చూడబోనని, మానవత్వాన్నే చూస్తానని వెల్లడించారు. రాజకీయ నేతల ఆలోచనా విధానం మీదే తన పోరాటమని, వ్యక్తుల మీద కాదని అందుకే తాను వారి పేర్లు ప్రస్తావించనని తెలిపారు. కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన కౌలు రైతు భరోసా సభలో పవన్ ప్రసంగించారు.
జగన్ రాష్ట్రానికి కాకుండా వైసీపీకి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, అయన పాలనలో రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతోందన్న అభిప్రాయం బలంగా ఉందని చెప్పారు. వారసత్వ రాజకీయాలను సంపూర్ణంగా నిర్మూలించలేకపోయినా కొంతమేరకు అయినా అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కౌలు రైతు భరోసా యాత్రపై ఓ వాట్సాప్ మెసేజ్ పెట్టినందుకు నాగేంద్రా రెడ్డి అనే ఒక దివ్యాంగుడిని వైసీపీ నేతలు బెదిరించారని, ఇలా చేయడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు.
తన ఆలోచన మార్పు కోసమేనని, నాడు అన్నయ్య ప్రజారాజ్యం పెట్టింది కూడా సమాజంలో మార్పు తీసుకు రావడం కోసమేనని చెప్పారు. ఆ సమయంలో సీమ ప్రజలు కూడా తమను పెద్ద ఎత్తున ఆదరించారన్నారు. నాడు కొంతమంది నేతలు ఒత్తిడి తెచ్చి మరీ తమ పార్టీని ఓ జాతీయ పార్టీలో విలీనం చేయించారని, ఆ పార్టీ కొనసాగి ఉంటె రాష్ట్రానికి ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని అభిప్రాయపడ్డారు. సిద్దులు తిరిగిన ప్రాంతం రాయల సీమ అని గుర్తు చేశారు. రాయలసీమ చదువుల నేల అని, ఎందరో కవులు రచించిన పద్యాలతో నాడు అలరారిన ఈ నేలలో ఇప్పుడు మద్యం ప్రవహిస్తోందని విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
Also Read : ఆ నేతల స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్