అల్లు శిరీష్ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ‘ఊర్వశివో రాక్షసివో‘ సినిమా రూపొందింది. ధీరజ్ మొగిలినేని – విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 వారు సమర్పిస్తున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి హైదరాబాదులోని ‘జేఆర్సీ కన్వెన్షన్’ లో నిర్వహించారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి, మారుతి .. పరాశురామ్ .. చందూ మొండేటి .. వశిష్ఠ గౌరవ అతిథులుగా వచ్చారు.
ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. “మొదటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి ఎంతో సాన్నిహిత్యం .. చనువు ఉన్నాయి. అదే అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నా వయసు 14 ఏళ్లు. 1974లో నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే ‘గీతా ఆర్ట్స్’ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ బ్యానర్ పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్ గౌరవాన్ని పెంచుతూ ఈ రోజున ఈ స్థాయికి తీసుకుని రావడం నిజంగానే గొప్ప విషయం. దీని వెనుక అల్లు అరవింద్ గారి కృషి .. పట్టుదల ఉన్నాయి.
ఇప్పుడు కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు .. తెలుగు సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే శిరీష్ బయటకూడా ఇలానే ఉంటాడా అనే డౌట్ వస్తోంది. అతన్ని ఒకసారి ‘అన్ స్టాపబుల్’కి రప్పించి అన్ని విషయాలను బయటికి లాగవలసిందే. నా అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో .. నేను అలాగే కనిపిస్తూ వస్తున్నాను. నా ఇష్టాన్ని వాళ్లపై రుద్దడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎవరికి తగిన కథలను .. పాత్రలను వారు చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.