Friday, March 29, 2024
HomeTrending Newsట్యాపింగ్ ముమ్మాటికీ నిజం: శ్రీధర్ రెడ్డి

ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం: శ్రీధర్ రెడ్డి

తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఓ పోలీసు అధికారి స్వయంగా తనకు చెప్పారని, కానీ మొదట్లో తాను నమ్మలేదని… కానీ కొన్నాళ్ళ తరువాత తన ఫోన్ కు వచ్చిన ఓ మెసేజ్ ద్వారా ట్యాపింగ్ చేస్తున్నట్లు స్పష్టమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇది తెలిసిన తరువాత తన తలరాత ఎలా ఉంటే అలా ఉంటుంది కాబట్టి తనను అనుమానించిన చోట చోట ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాను ఆధారాలు బైట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కష్టకాలం వస్తుందని, కేంద్రం దీనిపై విచారణకు ఆదేశించే అవకాశం వస్తుందని… అందుకే  ఇప్పటివరకూ వాటిని బైట పెట్టలేదని, ఆఫ్ ద రికార్డ్ గా కొంత మందికి మాత్రమే చూపించానన్నారు.   సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. తాను నమ్ముకున్న నాయకుడికే తనపై విశ్వాసం లేనప్పుడు పార్టీలో కొనసాగలేనని, కనీసం తనను సంజాయిషీ కూడా అడగకపోవడం భావ్యంకాదని వ్యాఖ్యానించారు.

తనకు నటన రాదనీ, 15నెలల ముందే తన పదవి వద్దని, అధికారం వద్దని అనుకుంటున్నట్లు శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.  నిన్న బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగించాయని, అసలు ట్యాపింగ్ జరగలేదని, తాను పార్టీ మారాలని అనుకున్నందుకే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు  ఆయన మాట్లాడడం బాధ కలిగించిందని, అందుకే తాను ఈ ఆధారాలు బైట పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బాలినేని మాటలు ఆయనవి కాదని, సాక్షాత్తూ సిఎం మాట్లాడించినట్లే భావిస్తున్నానని చెప్పారు. అందుకే తానుబాధతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలో ఇక కొనసాగలేనని తేల్చి చెప్పారు.

తాను ఎస్ ఎస్ రావత్ గురించి తన స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో రికార్డును ఇంటెలిజెన్స్ చీఫ్ తనకు పంపారని, తమ ఇద్దరిదీ ఐ  ఫోన్ అని, రికార్డు ఎలా సాధ్యమని, అందుకే ట్యాపింగ్ జరిగినట్లు రుజువు అవుతోందని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని, అయినా  వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఇన్నాళ్ళూ భరించానని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి తాను వీర విధేయుడినన్న విషయం అందరికీ తెలుసనీ, జీవితంలో ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. తాను నిత్యం ప్రజల్లో ఉన్నానని, పార్టీకి కూడా విధేయుడిగానే ఉన్నానని చెప్పారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టక ముందే నేను నా కార్యకర్త కార్యక్రమం అమలు చేశానని గుర్తు చేశారు.  వైసీపీకి కష్టకాలంలో అండగా ఉన్నానని, ప్రజా సమస్యలు ప్రస్తావించడమే తప్పా అని ప్రశ్నించారు.

Also Read : వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ: కోటంరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్