విజయవాడ పార్లమెంట్ కు తాను ఓ కాపలాకుక్కలా ఉంటానని లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. తాను దోచుకొను, ఎవరినీ దోచుకోనివ్వనని అందుకే అక్రమార్కులకు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిసిలు లేదా మైనార్టీలు పోటీ చేయాలని, అక్కడినుంచి తన కుమార్తె శ్వేత పోటీ చేస్తుందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మైలవరం నుంచి కూడా శ్వేత పోటీ చేయవచ్చేనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. తనతో పాటు కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయడంలేదని తేల్చి చెప్పారు.
కేవలం సంపాదన కోసమే కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఆ తర్వాత సంపాదించుకోవడమే థ్యేయంగా పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తన కార్యాలయం కేశినేని భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ చేయాలంటే త్యాగం చేయాలని, దానికి సిద్ధపడేవారే రావాలని సూచించారు. అక్రమంగా సంపాదించేవారిపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రాజకీయ పరిణితి కలిగి ఉందని, మనిషిని చూసి ఒతేస్తారు తప్ప, పార్టీని చూసి కాదని… తన రెండు ఎన్నికలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ మంచి వ్యక్తికి సీటు ఇస్తే కచ్చితంగా గెలిపిస్తామని, లేకపోతే ఓడిస్తామని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ పాలనపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారని జోస్యం చెప్పారు.