Babu in Kuppam: తాను ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పం కంటే ముందు పులివెందులకు హంద్రీ నీవా నుంచి నీరు అందించానని, కానీ సిఎం జగన్ కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అభివృద్ధి పరంగా కుప్పం ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. అమ్మకి అన్నం పెట్టనివాడు ఇక మనకేం అన్నం పెడతాడని, చెల్లెల్ని రాజకీయ అవసరాలకు వాడుకుని వదిలేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో మూడురోజుల పర్యటనలో భాగంగా దేవరాజపురం గ్రామానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బాబు ప్రసంగించారు.
కుప్పం స్థానిక ఎన్నికల్లో అధికారం, డబ్బు తో విజయం సాధించిందని, 35 ఏళ్ళనుంచి తనను ఎంతో ఆదరిస్తున్న ఈ కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని భావోద్వేగంతో చెప్పారు. తాను నియోజకవర్గం మారుతున్నట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, కుప్పంను మరింత అభివృద్ధి చేస్తాను కానీ ఈ నియోజకవర్గాన్ని వదలి పెట్టాబోనని బాబు శపథం చేశారు.
సీఎం జగన్ హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు అన్నారు. తాను ఎవరినీ వదలి పెట్ట బోనని, వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్ళపాటు అభివృద్ధిలో వెనక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : చంద్రబాబు కోటలో వైసీపీ పాగా