ఐసీసీ టి-20 పురుషుల వరల్డ్ కప్ లో మొదటిరోజే సంచలనాలు నమోదయ్యాయి. టోర్నీ మొదటి మ్యాచ్ లో పి.ఎన్.జీ.పై ఒమన్ ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో పటిష్ట బంగ్లాదేశ్ పై స్కాట్లాండ్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. బిసిసిఐ అధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ నేడు మొదలైంది. ఈనెల 22 వరకూ ఎనిమిది జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ లు జరగనున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్ 12 లో చోటు దక్కించుకుంటాయి. అక్టోబర్ 23 నుంచి సూపర్-12 మ్యాచ్ లు మొదలవుతాయి.
ఒమన్ లోని అల్ అమరాత్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ఒమన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పీఎన్జీ లో కెప్టెన్ అస్సద్ వాలా- 43 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 56, చార్లెస్ అమిని-37, సేసే బావు-13 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో కెప్టెన్ జీషాన్ మక్సూద్-4. బిలాల్ ఖాన్, ఖలీముల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఒమన్ జట్టు 13.4 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా లక్ష్యం చేరుకుంది. ఓపెనర్లు జితేందర్-73 (42 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు); అఖిబ్ ఇలియాస్-50 (43 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సర్) పరుగులతో అజేయంగా నిలిచారు.
నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన జీషాన్ మక్సూద్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఒమన్ లోని అల్ అమరాత్ క్రికెట్ గ్రౌండ్ లోనే జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ లో క్రిస్ గ్రేవ్స్-45 (28 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) ఓపెనర్ జార్జ్ మున్షి-29; మార్క్ వాట్ -22 చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
స్కాట్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ముషాఫికుర్ రహీం-38, కెప్టెన్ మహామదుల్లా-23; షకీబ్ అల్ హసన్-20; అఫీఫ్ హుస్సేన్- 18 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. దీనితో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే బంగ్లాదేశ్ చేయగలిగింది.
45 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టిన క్రిస్ గ్రేవ్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.