ఐసిసి వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా భారీ విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న రోహిత్ సేన నేడు బెంగుళూరు చినస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేయగా డచ్ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
తొలి వికెట్ కు ఇండియా 100 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51; రోహిత్ శర్మ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61; విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 51 పరుగులు చేశారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్- కెఎల్ రాహుల్ లు నాలుగో వికెట్ కు 208 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించారు. రాహుల్ 64 బంతులో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేసి ఔట్ కాగా, అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ దే లీడ్ 2; వాన్ మీకరన్, వాన్ డేర్ మిర్వ్ చెరో వికెట్ పడగొట్టారు.
నెదర్లండ్స్ జట్టులో తెలుగు తేజం నిడమానూరు తేజ -54; సై బ్రాండ్ -45; కోలిన్-35; మాక్స్ ఒదౌద్-30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసి చెరో వికెట్ తీయడం విశేషం. బుమ్రా, సిరాజ్, జడేజా, కులదీప్ లు తలా రెండు వికెట్లతో రాణించారు.
శ్రేయాస్ అయ్యర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఈ మ్యాచ్ లో లీగ్ దశ ముగిసింది. నవంబర్ 15న బుధవారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది.