ICC T20 Wc India Beat Scotland By 8 Wickets In Just 6.3 Overs :
ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో ఇండియా భారీ విజయం మోదు చేసింది. స్కాట్లాండ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి స్కాట్లాండ్ ను 85 పరుగులకే కట్టడి చేయగలిగారు. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు, జస్ ప్రీత్ బుమ్రా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు వీరవిహారం చేయడంతో కేవలం 6.3 ఓవర్లలోనే ఇండియా లక్ష్యాన్ని చేరుకొని రన్ రేట్ మెరుగుపర్చుకుంది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. కేవలం 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఒక మార్పు చేశారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు.
మూడో ఓవర్లో 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కొయిట్జేర్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మంచి ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ జార్జ్ మున్సీ-24 (19 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) ని షమీ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఏడోఓవర్లో జడేజా రెండు వికెట్లు (మాథ్యూ క్రాస్-2; రిచీ బెరింగ్టన్-0) తీసుకున్నాడు. మిగిలిన వారిలో మైఖేల్ లీస్క్-21; మెక్ లియోడ్-16; మార్క్ వాట్-14 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. 17.4 ఓవర్లలో 85 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌట్ అయ్యింది.
సెమీస్ కు చేరాలంటే మంచి రన్ రేట్ సాధించాల్సిన తరుణంలో ఇండియా ఆ మేరకు ఎదురుదాడి మొదలు పెట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ చెలరేగి ఆడారు. తొలి వికెట్ కు ఐదు ఓవర్లలోనే 70 పరుగులు రాబట్టారు. ఐదో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ బ్రాడ్ వీల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. ఆరో ఓవర్ చివరి బంతికి రాహుల్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి మార్క్ వాట్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద మాక్ లియోడ్ క్యాచ్ కు ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు.
నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
Must Read :భారత్ ఆహ్వానం తిరస్కరించిన పాక్