ICC T20 Wc Pakistan Beat Namibia By 45 Runs :
టి-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు విజయాలతో గ్రూప్ 2 లో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాక్ నేడు నమీబియాపై 45 పరుగులతో గెలుపొంది వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వికెట్ కు పాక్ 113 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 49 బంతుల్లో 7 ఫోర్లతో 70 పరుగులు చేసి డేవిడ్ వీస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఫఖర్ జమాన్ ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్-79 (50 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లు), మహమ్మద్ హఫీజ్-32 (16 బంతుల్లో 5 ఫోర్లు)లు మరో వికెట్ పడకుండా ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 189 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో వీస్, జాన్ ఫ్రై లింక్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మైఖేల్ వాన్(4) హసన్ అలీ బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండో వికెట్ కు స్టీఫెన్ బార్డ్, క్రెగ్ విలియమ్స్ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టీఫన్ బార్డ్ 29 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. విలియమ్స్ 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ వీస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్ష్యం పెద్దదైనా నమీబియా మెరుగైన ఆట తీరు ప్రదర్శించిందని చెప్పవచ్చు, 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, హారిస్ రాఫ్, షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
యాభై బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Must Read :దుబాయ్ కి మారిన టి-20 వరల్డ్ కప్