Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్స్కాట్లాండ్ జోరు : సూపర్ 12లో చోటు

స్కాట్లాండ్ జోరు : సూపర్ 12లో చోటు

ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ సూపర్ 12లో చోటు సంపాదించింది. నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఒమన్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన స్కాట్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ‘బి’ లో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ బి లీగ్ దశ మ్యాచ్ లు నేటితో ముగిశాయి,  స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 12 కు అర్హత సంపాదించాయి.

ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్న గ్రూప్-2లో స్కాట్లాండ్ చోటు దక్కించుకోగా… ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఉన్న గ్రూప్-1 లో బంగ్లాదేశ్ చేరింది.

ఒమన్ లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఒమన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అకిబ్ ఇలియాస్-37 (35 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు) ; మహమ్మద్ నదీం-25 (21 బంతుల్లో 2 సిక్సర్లు); జీషన్ మక్సూద్-34 (30 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) మాత్రమే రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ మూడు, సఫియాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్ చెరో రెండు, మార్క్ వాట్ ఒక వికెట్ పడగొట్టారు.

స్కాట్లాండ్ లో ఓపెనర్లు జార్జ్ మున్షీ-20; కైల్ కొయిజెర్- 28 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 41 పరుగులు చేశారు. ఆ తర్వాత మాథ్యూ క్రాస్ 35 బంతుల్లో 26 ; రిచీ బెరింగ్టన్ 21 బంతుల్లో 1ఫోర్ 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి స్కాట్లాండ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఒమన్ బౌలర్లలో ఫయ్యజ్ భట్, ఖవార్ ఆలీ చెరో వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లు పడగొట్టిన స్కాట్లాండ్ బౌలర్ జోష్ డేవీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

 ఈ విజయంతో స్కాట్లాండ్  అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో మొదటిసారి గ్రూప్ దశను దాటి రెండో రౌండ్ కు చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్