ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైర్ టోర్నీలో నేడు జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై శ్రీలంక 133 పరుగులతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే సెంచరీ, సమర విక్రమ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
బులావాయో లోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 48 పరుగుల వద్ద ఒకేసారి 2 వికెట్లు (పాథుమ్ నిశాంక-20; కుశాల్ మెండీస్ డకౌట్) లంక కోల్పోయింది. మూడో వికెట్ కు కరుణ రత్నే- సమర విక్రమ 168 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సమర విక్రమ 86 బంతుల్లో 4 ఫోర్లతో 82 రన్స్ చేసి ఔట్ కాగా, కరుణరత్నే 103 బంతుల్లో 8 ఫోర్లతో 103 రన్స్ చేశాడు. అసలంక-38, ధనుంజయ డిసిల్వా-42 పరుగులు చేశారు. 49.5 ఓవర్లలో 325 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 4; బ్యారీ మెక్ కార్తి 3; డెలానీ 2 వికెట్లు పడగొట్టారు.
లక్ష్య సాధనలో 58 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టులో కర్టిస్ కాంపర్-39; హ్యారీ టెక్టార్-33 మాత్రమే రాణించారు. 31 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వానిందు హసరంగ మరోసారి ఐదు వికెట్ల మార్కు తో సత్తా చాటాడు. మహీష తీక్షణ 2; కాసున్ రజిత, లాహిరు కుమార, దాసున్ శనక తలా ఒక వికెట్ పడగొట్టారు.
సెంచరీ సాధిచిన కరుణ రత్నే కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.