If Article 370 Is Not Restored In Jammu And Kashmir There Will Be Chaos :
జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్దరించాలని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిలిటరీ బలగాలతో కశ్మీర్ ను కలిపి ఉంచలేరని హెచ్చరించారు. భారత దేశంతో కాశ్మీర్ కలిసి ఉండాలంటే 35 ఎ , 370 ఆర్టికల్ పునరుద్దరించాలని సూచించారు. రంభాన్ జిల్లా బనిహాల్ లో జరిగిన బహిరంగ సభలో మహబూబ ముఫ్తీ కేంద్ర ప్రభుత్వం తీరుతో కశ్మీర్ ఇంకా వెనుకబాటుకు గురవుతోందని విమర్శించారు. కశ్మీరీలు గాంధేయ మార్గాన్ని నమ్ముతారని, బాపూజీ కశ్మిరీలకు ఇచ్చిన 35 ఎ , 370 ఆర్టికల్ పునరుద్దరించక పోతే లోయలో పరిస్థితులు అదుపులో ఉంచటం కష్టం అన్నారు.
రెండు వందల ఏళ్ళ పోరాటంతో భారత దేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం వచ్చిందని, కశ్మీర్ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజ్యాంగం ఇచ్చిన 370, 35 ఎ ఆర్టికల్స్ 70 ఏళ్ళుగా ఉన్న వాటిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేయటం గర్హనీయమన్నారు. కశ్మీర్ ప్రజలు తలచుకుంటే 70 నెలల్లో వాటిని తిరిగి సాధించుకుంటారని, అయితే 370, 35 ఎ ఆర్టికల్స్ సాధించుకుంటే సరిపోదని రాజ్యాంగ బద్దంగా కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలన్నదే తమ డిమాండ్ అని మహబూబా ముఫ్తీ అన్నారు. ఇప్పటికే వేల మంది యువత కశ్మీర్ అస్థిత్వం కాపాడేందుకు ప్రాణత్యాగాలు చేశారని, ఇకనైనా లోయలో శాంతి, సుస్థిరత నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలని మహబూబా ముఫ్తీ కోరారు.
Also Read : ఇంగ్లాండ్ లో భారతీయ జనగణన గుర్తులు