10.3 C
New York
Saturday, December 9, 2023

Buy now

HomeTrending NewsBC votes: అన్ని పార్టీలది ఒకటే నినాదం

BC votes: అన్ని పార్టీలది ఒకటే నినాదం

తల్లి ఏడుస్తుంటే బిడ్ద కూడా ఏడ్చినట్టు రాజకీయ పార్టీల తీరు ఉంది. కులవృత్తులు కాపాడుతున్నాం..బీసీ ఓట్లు మాకే అని బీఆర్ఎస్ .. బీసీ డిక్లరేషన్ ప్రకటించాం ఆ వర్గం ఇక మావైపే అని కాంగ్రెస్..మేమేం తక్కువనా అన్నట్టు బిజెపి ఏకంగా సిఎం బీసీ నేత అవుతాడని తేల్చి చెప్పింది.

తెలంగాణలో బిజెపి గెలిస్తే బీసి వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో ప్రకటించటం…ఎన్నికల వేళ కొంత ఆకట్టుకుంది. బలహీన వర్గాల నాయకుడు సిఎం అవుతారని చెప్పారు అది ఎవరు అనేది వెల్లడించలేదు. సిఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్ళటం బిజెపిలో సంప్రదాయంగా వస్తోంది.

అమిత్ షా ప్రకటనతో బిజెపిలో ఎవరికీ వారే జబ్బలు చరుచుకుంటున్నారు. బండి సంజయ్ కుమార్, కే లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరందరిలో ఈటెల రాజేందర్ సిఎం పదవిపై ధీమాతో ఉన్నారు. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ హయంలో కమలం పార్టీ…గులాబీని డీకొట్టే స్థాయికి చేరింది. అకస్మాత్తుగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక ఆరోజు నుంచి పార్టీ గ్రాఫ్ పడిపోతోంది అంటే షేర్ మార్కెట్ కన్నా స్పీడుగా ప్రజాభిమానం కోల్పోతోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. బండి సంజయ్ హయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరితే కిషన్ రెడ్డి హయంలో ఉన్న నేతలను కాపాడుకోవటం గగనమైంది.

ఈ తరుణంలో బీసీ నేత సిఎం అవుతారని అమిత్ షా ప్రకటిస్తే నిజంగా బలహీన వర్గాలు నమ్ముతాయా? గతంలో టిడిపి గెలిస్తే ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అప్పుడు అరకొర సీట్లతో సైకిల్ చతికిల పడింది. ఇప్పుడు బిజెపి వైఖరి కూడా అదే విధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఎదో ఒక రీతిగా బీసీలకు 28 సీట్లు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇప్పటివరకు ఇచ్చిన సీట్లలో ఖచ్చితంగా ఓడిపోయేవి ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ సంగతి సరే సరి అధికారంలోకి వచ్చాక బీసీ రైతు బంధుతో ఆదుకుంటామని ఎన్నికల హామీ ఇస్తోంది. కుల వృత్తులు కాపాడేందుకు ఇప్పటి వరకు ఇస్తున్న సాయాన్ని పెంచుతామని సిఎం కెసిఆర్ చెపుతున్నారు.

గుడ్డిలో మెల్ల బిజెపి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇవ్వటంతో పాటు అంగ బలం, అర్థ బలం తోడైతేనే…అందుకు బిజెపి నాయకత్వం దన్నుగా నిలిస్తేనే బీసీ నేతలు చట్ట సభలకు వెళ్ళగలుగుతారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో చక్రం తిప్పాలని బిజెపి భావిస్తోంది. ఆ విధంగా జరగాలంటే జాతీయ స్థాయి కమల దళం యావత్తు తెలంగాణ పల్లెలను జల్లెడ పట్టాలి. ఆ విధంగా చేస్తారా చూడాలి.

గులాబి – కమలం దోస్తీ ఉందని కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ అనుమానం బలపడే విధంగా సిరిసిల్ల బిజెపి టికెట్ రాణిరుద్రమ రెడ్డికి ఇచ్చారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన లైశెట్టి శ్రీనివాస్ ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. సిరిసిల్లలో చేనేత ఓట్లు 60 వేల పైచిలుకు ఉంటాయి. ఆ వర్గాన్ని కాదని వేరే జిల్లాకు చెందిన నేతకు టికెట్ ఇవ్వటం అనుమానాలకు తావిస్తోంది.

చదరంగంలో అవసరానికి తగ్గట్టుగా సైనిక పావులను వాడినట్టు బీసీలను రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అమిత్ షా మాటలే నిజమైతే బిజెపి రెండో లిస్టులో అది ప్రస్పుటం అవుతుంది. పార్టీల పునాదులు బలహీన పడినపుడు బీసీ నినాదం ఎత్తుకోవటం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బీసీల పట్ల రాజకీయ పార్టీల వైఖరి ఈ విధంగా ఉంటే… బీసీలు ఏ గుర్తును ఆదరిస్తారో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్