Monday, February 24, 2025
HomeTrending Newsమళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావోద్వేగంతో వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో తాను 9 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశానని.. కానీ, గత ప్రభుత్వంలో ఉన్నంత దుర్మార్గ నాయకులను ఏనాడూ చూడలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు మంచి పాలన అందించేందుకు కృషి చేద్దామని సహచర సభ్యులకు  పిలుపునిచ్చారు. నర్సీపట్నం శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను చంద్రబాబుతో పాటు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,  బిజెపినేత- ఏపీ విద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్, మంత్రి అచ్చెన్నాయుడు స్పీకర్ స్థానానికి తోడ్కొని వెళ్ళారు.

అయ్యన్నకు అభినందనలు తెలిపే సందర్భంలో మాట్లాడిన చంద్రబాబు గత సభలో అనుభవించిన వేదన, అవమానాన్ని గుర్తు చేసుకున్నారు.  “నాడు కౌరవ సభలో శపధం చేసి బయటకు వచ్చా. నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగు పెట్టా. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడ బిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన సభ పైన ఉంది. గతంలో మాదిరిగా, బూతులు, వ్యక్తిత్వ హననం, హేళనలు ఉండవు. ఇది గౌరవ సభ, ప్రజల సభ” అంటూ అభివర్ణించారు.

గత ఎన్నికల్లో తమ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే వస్తే దాన్ని నాటి సిఎం ఎద్దేవా చేశారని, దేవుడి స్క్రిప్టు అంటూ హేళన చేశారని, కానీ అమరావతి రైతులు 1631 రోజులు రాజధాని కోసం దీక్ష చేస్తే మొత్తం కలిపి 11 అవుతుందని, ఆ పార్టీకి కేవలం 11 సీట్లే ఇచ్చారని… ఇది అసలైన దేవుడి స్క్రిప్ట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్