Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Telugu Film Industry- AP government:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం…

ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది

బెనిఫిట్ షో లకు అనుమతి లేదు

రోజుకు కేవలం నాలుగు ఆటలు మాత్రమే

ప్రీమియర్ షోల పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొనే అవకాశం లేదు..

రెండు మూడు నెలలనుంచి ఈ ప్రతిపాదనలనపై చర్చ జరుగుతోంది. వీటిని తెలుగు సినిమా అగ్ర నటులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకులు, పోటీలు పడి మరీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్ననిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అలా అని ఇప్పటివరకూ ఎవరూ బహిరంగంగా తమ నిరసన వ్యక్తం చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం మొదట్లో విన్నపం చేశారు, ఆ తర్వాత అసహనంతో కూడిన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బిల్లు ఆమోదించింది కాబట్టి ఇప్పుడేమి చేస్తారో చూడాలి. మరికొందరు ‘అమరావతి’ లాగానే ఇది తమ సామాజికవర్గంపై జరుగుతున్న దాడిగా లోలోపల కుమిలిపోతున్నారు. అయితే ఈ నిబంధనలన్నీ ప్రత్యక్షంగా ఎనిమిది నుంచి పది మంది అగ్రహీలోల సినిమాల మీదే తీవ్రమైన ప్రభావం చూపుతాయని, చిన్న సినిమాల విషయంలో పెద్దగా అందోళన చెందాల్సిందేమీ లేదని వాదించేవారూ కొందరు ఉన్నారు.

అయితే ‘అగ్ర’జుల బాధ ఏమిటో ఓసారి పరిశీలిస్తే….

పెద్ద సినిమాల బడ్జెట్లు వంద… రెండొందలు….ఇప్పుడు మూడొందల కోట్ల రూపాయల వరకూ వెళుతోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల సంగతి మనం అడగకూడదు, అడిగినా వారు చెప్పరనుకోండి….

ఇటీవలి కాలంలో తెలుగు పరిశ్రమలో వచ్చిన మరో వింత పోకడ….. హీరోలే నిర్మాతలుగా మారడం… ఇదివరకు నిర్మాతలు సెపరేట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏదో బాలయ్య బాబు లాంటి ‘నిప్పురవ్వ’ లు, రవితేజ లాంటి కొందరు హీరోలు తప్ప మిగిలిన ప్రతి అగ్ర, మధ్యస్థాయి హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలున్నాయి. ఇప్పుడు వేరే నిర్మాతలు సదరు హీరోలతో సినిమా తీసినా వారి సొంత సంస్థకు ఏదో రూపంలో ముడుపులు చెల్లించాలి లేదా కనీసం ఒక ఏరియా హక్కులైనా ఇవ్వాల్సిందే.  అసలు ఒక హీరో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన మరుక్షణం నుంచీ ఆ సినిమా అటో ఇటో తేలిపోయే వరకూ ఆ హీరో కారు పెట్రోల్ నుంచీ వారి బాత్ రూమ్ లో వాడే ఫినాయిల్ వరకూ నిర్మాతే భరించాలని టాక్.  ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు తమ రాబడి మొత్తం మొదటివారంలోనే రాబట్టుకోవడం కోసం…. వందలాది థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మొదటి వారం రోజులు రెట్లు పెంచి వసూలు చేస్తున్నారు..రోజుకు ఆరేడు బెనిఫిట్ షో లు వేసుకుంటున్నారు.

Natu song

దీనితో సినిమా బాగున్నా, బాగోలేకపోయినా నిర్మాత సేఫ్, కానీ సినిమా హక్కులు సొంతం చేసుకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పొరపాటునో, గ్రహపాటునో సినిమా ‘రాడ్’ అయి, ఆ విషయం ఉప్పందిన బయ్యర్లు జాగ్రత్త పడితే మాత్రం నిర్మాతల గతి ‘హుస్సేన్ సాగరే’.  ఈ నేపధ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం కొందరు హీరోలకు శరాఘాతంగా పరిణమించబోతోందనడంలో సందేహంలేదు.

ఒకానొక దశలో ప్రభుత్వం కొన్ని అంశాలపై సానుకూలంగా ఆలోచించాలని అనుకుంది. ఈలోగా… లక్షలాది మంది తనను అభిమానిస్తున్నారు కాబట్టి తాను దైవాంశ సంభూతుడినని, తాను మాట్లాడిందే వేదం అనే ధీమాతో మైకు ముందు ఇష్టానుసారం రెచ్చిపోయిన ఓ ‘రాజకీయ’ హీరో వ్యాఖ్యలతో సమస్య పరిష్కారం కాలేదు సరికదా మరింత జటిలమైంది.

అయితే ఇప్పుడు సగటు మనిషి తనను తాను అడుక్కుంటున్న ప్రశ్న ఒకటే…..సినిమాల్లో అన్యాయాలకు, అవినీతికి వ్యతిరేకంగా విలన్ల దుమ్ము లేపే హీరోలు….తమ సినిమాల వ్యాపార విషయంలో మాత్రం చూసీ చూడనట్లు వదిలేయాలని కోరుకోవడం…..బ్లాక్ మార్కెటింగ్ కు అనుమతివ్వాలని పరోక్షంగా అడగడం ఏమిటని?

సగటు సినీ ప్రేక్షకుడి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారని….సినిమా కలెక్షన్ల విషయంలో దర్శక నిర్మాతలు చెబుతున్న మాటలకు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన ఉండడంలేదని ప్రభుత్వం చెబుతోంది.  బ్లాక్ మార్కెటింగ్ ను పరిశ్రమకు చెందినవారే ప్రోత్సహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, బెనిఫిట్ షోల పేరుతో ఒక్కో టికెట్ ను 1500 రూపాయల వరకూ అమ్ముతున్నారని, ఇలాంటి కొన్ని అక్రమాలను నియంత్రించేందుకే కొత్త చట్టం తెచ్చామని చెబుతోంది.

తాము ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తున్నాం కాబట్టి తమ విషయంలో చట్టాలు, న్యాయాలను సడలించాలనుకోవడం  ఏపాటి న్యాయమో హీరోలే ఆత్మ విమర్శ చేసుకోవాలి

నాటి శంకరాభరణం సంగతి పక్కన పెట్టండి….

‘కంచరపాలెం’ సినిమాకు ఏ కంచెలైనా అడ్డుపడ్డాయా?

‘ఫిదా’ అన్నివర్గాలను ఫిదా చేయలేదా?

‘పలాస 1978’ కు ప్రభుత్వమిచ్చిన ఫలాలేమిటి?

‘క్రాక్’ సగటు ప్రేక్షకుడికి క్రాకెక్కించలేదా?

సినిమాలో కంటెంట్ ఉంతే దానంతట అదే ఆడుతుంది, నిర్మాతకు నెమ్మదిగా ధనరాశులు కురిపిస్తుంది తప్ప, ఎవరూ ఎలాంటి భిక్షా ఇవ్వాల్సిన అవసరం లేదు…

తమ వ్యాపార ధోరణి,  పెట్టుబడి వీలైనంత తొందరగా వెనక్కి రాబట్టుకోవాలన్న ఆత్రుతలో సినిమా వారు ఓ అంశాన్ని విస్మరించారు.  ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ‘ఫేవర్’ కావాలనుకున్నప్పుడు దానికో పధ్ధతి ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నవారిని ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నప్పుడు  ఎదురుగా కూర్చొని కొందరు చప్పట్లు కొట్టినా… తర్వాత ఈ అంశాన్నిఅసలైనవారు గట్టిగా ఖండించకపోయినా… అధికారంలో ఉన్న ‘పెద్ద’ల ఇగో దెబ్బ తింటుందని గ్రహించాలి.  తనను వ్యక్తిగా లెక్కచేయని వారి గురించి, చిన్నచూపు చూసే వారి క్షేమం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం  సహజంగానే ప్రభుత్వంలో ఉన్నవారికి ఉండకపోవచ్చు. అందులోనూ రాష్ట్రం ఇన్ని సమస్యల్లో ఉన్నప్పుడు సినిమా కష్టాలు  వారికి చిన్నవిగా అనిపించవచ్చు.

రాబోయే రెండునెలల్లో… మీడియా పరిభాషలో ‘భారీ నుంచి అతి భారీ’ సినిమాల విడుదలకు తేదీలు ఫిక్స్ అయిన ఈ తరుణంలో ప్రస్తుత సమస్యకు ఎలాంటి ముగింపు లభిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

– అభిజ్ఞ

Also Read :

తెలుగు పాటల తిక్క

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com