కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత దేశంలో జనతా కర్ఫ్యూ అమలు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. 2020 సంవత్సరం మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ఈ కర్ఫ్యూను పాటించారు. కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. ఆ మరుసటి రోజు 23 తేదీ నుంచే లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారిని ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా,ఇంటికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో 24వ తేదీ నుంచి పలు స్వచ్చంధ సేవా సంస్థలు, పలువురు ఔత్సహికులు తమ స్వంత ఖర్చులతో పనులు లేక ఇళ్లల్లోనే ఉండిపోయిన పేదలందరికీ నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, బియ్యం, వంట నూనెలు, ఫల సరుకులను పంపిణీ చేశారు.