Saturday, November 23, 2024
HomeTrending Newsఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు

ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు

పార్లమెంటులో ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్రమంగా బలం పెరుగుతోంది. ఈ నెలాఖరున ఓటింగ్‌ జరగనున్న ఈ తీర్మానానికి సంకీర్ణ ప్రభుత్వంలోని మూడు పార్టీలు తాము అనుకూలంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చాయి. దీంతో ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిపోకతప్పదని స్పష్టమవుతోంది. దేశంలో ఆర్థికసంక్షోభానికి కారకులయ్యారంటూ ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చించే కీలక సమావేశాలు రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్‌ – పాకిస్తాన్  (ఎంక్యూఎం – పీ), ది పాకిస్తాన్  ముస్లింలీగ్‌ – ఖయీద్‌ (పీఎంఎల్‌- క్యూ), బలోచిస్తాన్  అవామీ పార్టీ (బీఏపీ) ప్రతిపక్ష కూటమికి మద్దతు పలుకుతున్నట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

పాకిస్తాన్‌లో ప్రస్తుత ఆర్ధిక సంక్షోభానికి ఇమ్రాన్‌ ప్రభుత్వమే కారణమని విపక్షాలు అంటున్నాయి. విపక్షాలతో ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్‌-పాకిస్తాన్‌, ది పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఖాయీద్‌, బలోచిస్తాన్‌ అవామీ పార్టీలు స్వరం కలిపాయి. నిన్నటి వరకు ఈ మూడు పార్టీలు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఈ మూడు పార్టీలకు కలిపి 17 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇమ్రాన్‌ సొంత పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కు చెందిన 24 మంది సభ్యులు ఇప్పటికే ప్రతిపక్షాలతో చేరిపోయారు.

అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు వీరిని అనర్హులుగా ప్రకటిస్తే.. అవిశ్వాస తీర్మానం ఓటింగు నుండి వారు దూరమౌతారన్నది ఇమ్రాన్‌ వ్యూహం. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. అయితే తాను రాజీనామా చేయనని, చివరి బంతివరకు ఆడతానని తనదైన శైలిలో మాజీ క్రికెటర్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగి విమర్శించకూడదని,  తటస్థ వైఖరి గురించి గతంలో తాను  చేసిన వ్యాఖ్యలు అపార్థం చేసుకొన్నారని,  ఇప్పటికీ తనకు  ఆర్మీతో సత్సంబంధాలు ఉన్నాయని ఇమ్రాన్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్