పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మరోసారి భారత్‌ను పొగిడారు. ముందస్తు ఎన్నికల కోసం డిమాండ్ చేస్తున్న ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు లాంగ్ మార్చ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌ను మరోసారి కొనియాడారు. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుగోలు చేసిన భారత విదేశాంగ విధానాన్ని ఆయన మెచ్చుకున్నారు. ‘దేశానికి సంబంధించిన నిర్ణయాలు దేశం లోపల జరగాలి. రష్యా చౌకగా చమురు ఇస్తుంటే, నా దేశస్థులను రక్షించే అవకాశం ఉంటే మనల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. రష్యా నుంచి చమురును భారత్ తీసుకోవచ్చు. కానీ బానిస పాకిస్థానీలను దీనికి అనుమతించరు. నేను స్వేచ్ఛా దేశాన్ని చూడాలనుకుంటున్నాను. న్యాయం గెలువాలి, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించాలి’ అని అన్నారు.
కాగా, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్, భారత్‌ను పొగడం ఇదే తొలిసారి కాదు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆయన పలుసార్లు భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గని భారత్, రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసిందని, స్వేచ్ఛాయుత దేశమంటే అలా ఉండాలంటూ కితాబు ఇచ్చారు. పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ యాత్ర చేపట్టిన లాంగ్ మార్చ్… లహోర్ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు 380 కిలోమీటర్లు సాగనుంది. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర నవంబర్ 4వ తేదీ నాటికి ఇస్లామాబాద్ చేరుకుంటుంది.