ఇండియా- ఆస్ట్రేలియా మధ్య నేడు మొదలైన రెండో టెస్టులో కూడా ఇండియా బౌలర్లు మరోసారి సత్తా చాటారు. మహమ్మద్ షమి నాలుగు వికెట్లతో రాణించగా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. దీనితో తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయ్యింది. నేడే ఇండియా తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 పరుగుల వద్ద తొలి వికెట్ (వార్నర్-15) కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా 81 పరుగులతో రాణించాడు. జట్టు స్కోరు 91 వద్ద ఖవాజా తో పాటు స్టీవెన్ స్మిత్ (డకౌట్) కూడా వెనుదిరిగారు. హాండ్స్ కాంబ్ 72 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. కెప్టెన్ కమ్మిన్స్ 33; లబుషేన్-18 పరుగులు సాధించాడు.
తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ-13; కెఎల్ రాహుల్-4 పరుగులతో క్రీజులో ఉన్నారు.