తెలంగాణ గవర్నర్ తమిలిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇద్దరిని ఎంపిక చేయటానికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేశారు. వారి వివరాలు సరిగా వెల్లడించలేదని మెలిక పెట్టారు.
గతంలో పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిలిసై తిరస్కరించారు. అప్పుడు రాజ్ భవన్…ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటలో శాసనమండలికి పంపారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లును చాలా రోజులు తన వద్దే ఉంచుకున్నారు. కార్మికులు ధర్నాలు, ఆందోళనలు చేయటంతో చివరకు వ్యతిరేకత వస్తుందనే భావనతో ఆమోదించక తప్పలేదు.
తెలంగాణ గవర్నర్ గా వచ్చిన నాటి నుంచి తమిలిసై అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం సీతా రాముల కల్యాణానికి వెళితే ప్రోటోకాల్ పాటించటం లేదని ఆరోపించారు. కల్యాణం సమయంలో ఉన్నతాధికారులు రాకపోవటం అప్పుడు విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత భద్రాచలం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటంతో రైలులో వెళ్ళారు.
అలా ఒకటి రెండు సంఘటనల్లో గవర్నర్ పట్ల ప్రభుత్వ వైఖరి విమర్శలకు తావిచ్చింది. ఇదే అదునుగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే తన పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించి అబాసుపాలయ్యారు. బిజెపి నేతలు పార్టీ కార్యాలయానికి వెళ్ళినంత సులువుగా రాజ్ భవన్ కు రావటం ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయటం….అదే సమయంలో కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వకపోవటం జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ మొండి ఘటం. బస్తీ మే సవాల్ అన్నట్టుగా రాజ్ భవన్ ను పట్టించుకోవటమే మానేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చినపుడు రాజ్ భవన్ విందుకు సిఎం గైర్హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణ, కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సయోధ్య కుదరగా సిఎం కెసిఆర్ దగ్గర ఉండి మరి సచివాలయం విశేషాలను గవర్నర్ కు వివరించారు. ఇక పరవాలేదులే అనుకునే సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించటం కొత్త గొడవలకు దారి తీసేలా ఉంది.
నిజానికి దాసోజు శ్రవణ్ కుమార్ , కుర్ర సత్యనారాయణల విషయంలో గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం అనటంలో సందేహం లేదు. దాసోజు శ్రవణ్ విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పరిశోధకుడుగా మంచి పేరు ఉంది. ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ గతంలో బిజెపి నుంచి నిలబడి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
వీరిద్దరి మీద అవినీతి, నేర ఆరోపణలు ఏవీ లేవు. అయినా వీరి విషయంలో గవర్నర్ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమని అనుమానం కలుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ చర్య బీఆర్ ఎస్ కన్నా… బిజెపికి నష్టం కలిగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.