Wednesday, June 17, 2026
HomeTrending NewsUppal Women PS: ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం - హోం మంత్రి

Uppal Women PS: ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం – హోం మంత్రి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్ మరియు చర్లపల్లి పోలీస్ స్టేషన్ లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఉప్పల్ లో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసామన్నారు.

తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, సిసిటివిల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు. మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో, ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకు రక్షణ ఇస్తున్నామన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని, అందుకే స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చెల్ జిల్లాలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ ఉప్పల్ లో రావడం మరియు చర్లపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.


రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ మాట్లాడుతూ డ్రగ్స్ అక్రమ రవాణా మీద, కల్తీ విత్తనాల మీద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్నో కేసులు నమోదు చేసామని తెలిపారు. రోడ్ల మిద, కళాశాలల్లో, పని చేసే చోట ఎదురయ్యే వేధింపులు మరియు సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుండి ఎదురయ్యే వేధింపుల గురించి భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, డిప్యూటి మేయర్, డిసిపి ట్రాఫిక్ అభిషేక్ మొహంతి ఐపిఎస్, డిసిపి మల్కాజిగిరి జానకి ఐపిఎస్, డిసిపి మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, డిసిపి అడ్మిన్ నర్మద, డీసీపీ శ్రీ బాల, ఏడీసీపీలు, ఎసిపిలు, ఇతర అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular