Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిర్లిప్త్, నిరాశ్ లాంటి ట్రెండీ పేర్లకే డిమాండు

నిర్లిప్త్, నిరాశ్ లాంటి ట్రెండీ పేర్లకే డిమాండు

“పేరిడి నిను పెంచిన వారెవరే?
వారిని చూపవే! శ్రీరామయ్యా!
సార సారతర తారకనామమును పేరిడి…”
రాముడికి పేరు పెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య కీర్తించాడు.

“త్వయైక తారితాయోధ్య,
నామ్నాతు భువనత్రయం”
రామా! నువ్వు ఒక్క అయోధ్యనే పాలించావు. నీ పేరు ముల్లోకాలను రక్షించి, పాలిస్తోంది. నీకంటే నీ పేరే గొప్పది- అని హనుమంతుడు రాముడితోనే అన్నాడు.

కృష్ణుడికి ఆ పేరు పెట్టినవాడు గర్గ మహాముని. నందవ్రజానికి గర్గుడు ఈ నామకరణం కోసం వెళ్లినప్పుడే…నందుడు అన్న మాటను
“ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా !”
అని పోతన తెలుగు పద్యంలో రికార్డ్ చేశాడు. తరువాత “ఊరకరారు…” అన్న మాట తెలుగు భాషకు ఒక వాడుక మాట అయ్యింది.

పురాణాల్లో అవతారపురుషులకు పేర్లు పెట్టడానికి ఋషులు తపస్సు చేసి…పుణ్యం మూటగట్టుకుని పుట్టేవారు. ఇప్పుడు మన అవతారాలకు రుషుల అవసరమే రాదు. ఉన్నా ఉపయోగించుకోము.

ఈరోజుల్లో-
ముద్దులు మూట కట్టినట్లున్న ఒక పాపకు తల్లిదండ్రులు పరవశించి పెట్టుకున్న పేరు- అనాయ!

విహంగమై గగనంలో ఎగురుతుందనుకుని మరొక జంట తమ గారాల పట్టికి పెట్టుకున్న పేరు- విహాయ!

తమ బిడ్డ పెదవుల మీద ఎప్పటికీ చిరునవ్వు చెరిగిపోదనుకుని ఒక జంట నవ్వుతూ నామకరణం చేసిన తెలుగుపేరు- సుహాయ!

ఇప్పుడందరూ ట్రెండీగా ఉన్న పేర్లకోసం చేయని ప్రయత్నం లేదు.

అసహాయ
నిర్లిప్త్
నిస్సహాయ
నీరస్
నిరాశ్
నిర్మాల్య్
కైవల్య్
లాంటి ట్రెండీ పేర్లకు కూడా రేపు పరమ పవిత్ర భావంతో నామకరణాలు జరగవచ్చు.

పెంటయ్య
పుల్లయ్య
కోటయ్య
మల్లమ్మ
ఎల్లమ్మ…
పేర్లను కూడా ప్రయత్నిస్తే కొంచెం ట్రెండీగా మార్చుకోవచ్చు.

పెంట్
పెంటన్
పుల్లన్
కోటన్
ఏలే ఎం
ఎం మాల్

ఇలా చివర అమ్మ, అయ్య, అన్న, అప్ప లేకుండా న్, ల్, అని పొల్లు వస్తే చాలు. ఉత్తర భారత టచ్ వచ్చి పరమ ట్రెండీ అయి మన పేరు మనకే ముద్దొస్తుంది.

అజంత, హలంత భాషల లక్షణాలు, ఆ భాషోచ్చారణలకు సొంతమయిన పద్ధతుల గురించి మనకెందుకు?

కుక్కలకు టామీ, సోనీ అని అర్థరహితమయిన శబ్దప్రధానమయిన పేర్లు పెడుతుంటాం. దానికి ఆ పేర్ల మీద అభ్యంతరం ఉన్నట్లు ఇప్పటిదాకా మనకు తెలియదు. మనుషులకయినా అంతే. వారికి అభ్యంతరం లేనంతవరకు- పెట్టే పేర్లకు అర్థం లేకపోయినా పెద్ద అనర్థమేమీ జరగదు.

సరళ అని పేరున్న మహిళ చాలా కఠినంగా ఉండవచ్చు. హిమాంషు అన్నవాడు ఎప్పుడూ నిప్పులుగక్కుతూ చిటపటలాడుతుండవచ్చు. ధవళ్ పెద్దయ్యాక సింగరేణి బొగ్గు కంటే నలుపెక్కవచ్చు. నరసింహ గ్రామసింహానికే బెదిరిపోవచ్చు. శారద పదో క్లాసు మెట్లయినా తొక్కకపోవచ్చు. వీణ గొంతెత్తితే చెవుల్లో రక్తం కారవచ్చు.

నారాయణ, గోవిందా, దుర్గ, లక్ష్మి, ఉమ…అన్న పేర్లు పెడితే…పదే పదే ఆ పేరు పెట్టి పిలిచినందువల్ల నామోచ్చారణ పుణ్యం మన అకౌంట్లో పడుతుందని మన పోతన అజామిళోపాఖ్యానంలో అంటాడు.

తెలుగు నేల మీద పురాణ ప్రవచనాన్ని ఒక యజ్ఞంలా పవిత్రీకరించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పోతన భాగవతంలో అజామీళుడి గురించి చెబుతూ ఒక మాటన్నారు.
“ఖ్యాతి, హవ్య, కవ్య లాంటి ఎవరూ పెట్టుకోని పేర్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. చిత్రాతి, చిత్రమయిన; పలకడానికి నోరు తిరగని పేర్లు పెట్టి…లలితా సహస్రంలో ఈ మాటకు మూలం ఉందట కదా? అని మాలాంటి వారికి నామ జ్ఞాన బోధ చేస్తూ ఉంటారు. శతాబ్దాల క్రితం పోతన, కేతన, సోమన్న అని తెలుగు పేర్లు పెట్టుకునేవారు. తరువాత హాయిగా రామా, కృష్ణ అని దేవుడి పేర్లు పెట్టుకునేవారు. వంశంలో తాత ముత్తాతల; అవ్వ ముత్తవ్వల పేర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు పెట్టుకునే పేర్లకు అర్థం ఉండదు. తెలిసినా చెబితే బాగోదు”.

వంకర్
టింకర్
అంధ్
చే
వే
గే
లాంటి వినూత్న పేర్లు పెట్టుకుని పొంగిపోతున్నాం. ఆ పేర్లకు వారు సార్థకనామధేయులో? లేక పెరిగి పెద్దయి ఆ పేరుకు తగినట్లు ఉంటున్నారో? ఉండాలన్న సంకల్పంతోనే ఇలా నామకరణం చేస్తున్నారో?
ఏమో ఎవరికెరుక?
ఏ పేరులో ఏముందో?

అన్నట్లు-
పిల్లలకు పేర్లు పెట్టే వ్యాపారం మొదట అమెరికాలో ప్రారంభమయ్యింది. ఒక పేరు పెట్టినందుకు నేమింగ్ కంపెనీకి తల్లిదండ్రులు 26లక్షల రూపాయల ఫీజు చెల్లించడమే అమెరికాలో ఇప్పటిదాకా పెద్ద డీల్. భవిష్యత్తులో కోటి దాకా వెళ్ళవచ్చట.

నెమ్మదిగా భారత్ లోని అన్ని మెట్రో నగరాల్లో కూడా బేబీ నేమింగ్ కన్సల్టెన్సీ కంపెనీలు వెలిశాయి. ప్రపంచంలో ఎవరికీ ఉండని, వైవిధ్యమైన పేర్లకు ఇండియాలో కూడా విపరీతమైన డిమాండు. ఈమధ్య ఒక పాపకు పేరు పెట్టినందుకు బాంబేలో నాలుగు లక్షల రూపాయల ఫీజు వసూలు చేశారట.

చూస్తూ ఉండండి. పేర్ల బిజినెస్ కు భవిష్యత్తు ఉందని నమ్మకం కలిగితే ఈ దేశంలో అన్నిటినీ ఆక్రమించిన ఆ రెండు కంపెనీల తరువాతి వెంచర్ ఇదే కావచ్చు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular