మహిళలకు సంబంధించి సాధికారత(ఎంపవర్మెంట్), సమానత్వం(ఈక్వాలిటీ), సమాన అవకాశాలు(ఈక్వల్ ఆపర్చునిటీస్) విషయాల్లో గతంతో పోలిస్తే కొంత నయమే కానీ…పూడ్చాల్సిన లోటు మాత్రం ఇంకా చాలా చాలా మిగిలే ఉంది. సందర్భం వేరైనా జాషువా ఒక చోట అన్న “అప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్” మాట మహిళలకు కూడా అంతే అన్వయమవుతుంది. భారతదేశం మహిళలకు చాలా అప్పుపడి ఉంది. క్రికెట్ విషయంలో కూడా అంతే.
క్రికెట్ ఈ దేశంలో ఒక మతం. క్రికెటర్లు ఆరాధ్యదేవుళ్ళకంటే ఎక్కువ. కొన్ని దశాబ్దాలుగా మహిళలు క్రికెట్లో నిలదొక్కుకుంటున్నారు. అద్భుతమైన ఆట, నైపుణ్యం, కఠోర శ్రమతో రాణిస్తున్నా…పురుషుల క్రికెట్ కు ఉన్నంత డిమాండు మహిళా క్రికెట్ కు లేదు. ఈ చిన్నచూపు ఈనాటిది కాదు. తరతరాలది.

బాంబేలో జరిగిన మొన్నటి వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లో 339 పరుగుల సముద్రమంత లక్ష్యం. తలపడుతున్నది పేరుమోసిన ఆస్ట్రేలియా జట్టుతో. మొదటి ఇద్దరు క్రీడాకారులు తడబడి తక్కువ పరుగులకే పెవిలియన్ ముఖం పట్టారు. అప్పుడొచ్చింది జెమీమా రోడ్రిగ్స్. అద్భుతం చేసి చూపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి చెలరేగి ఆడింది. వికెట్లు పడుతున్నా ఒంటరిపోరాటం చేసింది. నిలబడింది. చేజారిపోయిందనుకున్న మ్యాచ్ ను చేతిలోకి తీసుకుని గెలిపించింది.
ఆటలో గెలుపోటములు సహజం. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఫలితం ఎలాగైనా ఉండవచ్చు. ఇది ఫైనల్ కు మించి గుర్తుండిపోయే ఫలితం. సగటు క్రికెట్ అభిమానులు మహిళల- పురుషుల అన్న వివక్షను చెరిపేసి క్రీడగా చూడాల్సిన పోరాటపటిమ.
అంతకుముందు జెమీమా ఎన్నెన్ని కష్టాలు పడ్డదో! ఎన్నెన్ని అవమానాలను ఎదుర్కొందో! ఎన్నెన్ని రోజులపాటు ఏడుస్తూ కూర్చుందో! తెలుసుకుంటే గుండె చెరువవుతుంది. ఆమె తండ్రి చేసిన క్రైస్తవ మత ప్రచారాన్ని సాకుగా చూపి…ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఆమెకు క్రికెట్ క్లబ్ మెంబర్షిప్ ను రద్దు చేసిన చోటే ఇంకెవ్వరూ రద్దు చేయడానికి వీలుకాని తన చరిత్రను తానే లిఖించుకుని… ఆనందబాష్పాలతో తండ్రిని కౌగిలించుకుంది. బహుశా జరిగిన అవమానాలు, దిగమింగుకున్న కష్టాలు, పడ్డ ఇబ్బందులు, మునిపంట భరించిన బాధలు అన్నీ ఆ కన్నీళ్ళలో కొట్టుకుపోయి ఉండాలి. కెప్టెన్ హర్మన్ పోరాటం కూడా వేనోళ్ళ కొనియాడదగ్గది.

మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చాయి. రావాలి కూడా. వారి దారికి అడ్డుపడకుంటే మన ఇంట్లోనో, మన ఊళ్ళోనో జెమీమాలు, హర్మన్లు తయారవుతారు. శబ్దాన్ని మించిన వేగంతో దూసుకెళ్ళే విమానాలను కూడా మహిళలు నడపగలుగుతున్నా ఇంకా అబలలు అనడం మనల్ను మనం అవమానించుకోవడమే. అబలలు అన్న మాటను వాడుకలో నిషేధించాలి.
రాసి పెట్టుకోండి. ఇలాంటి జెమీమాలు నలుగురు నిలకడగా ఆడుతూ ఉంటే…ఏదో ఒకనాటికి మహిళలు-పురుషులతో కలిసిన టీం కూడా ఏర్పడుతుంది. అప్పటిదాకా మనం గొంతుచించుకుని అరిచే మహిళా సమానత్వం మాటలకే పరిమితం అనుకోవాలి.
-పమిడికాల్వ మధుసూదన్
99890090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

