Shreyas Century:
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్ తన కెరీర్ లో ఆడిన మొదటి టెస్ట్ లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు, 105 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇండియా 4 వికెట్లకు 258 పరుగులతో రెండోరోజు ఆట మొదలు పెట్టింది. నిన్న అర్ధసెంచరీ చేసిన జడేజా నేడు పరుగులేమీ జోడించకుండానే ఔటయ్యాడు. వృద్ధిమాన్ సాహా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్-38; ఉమేష్ యాదవ్-10 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో మొత్తం 111.1 ఓవర్లపాటు ఆడిన ఇండియా 345 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో సౌతీకి ఐదు; జేమిసన్ మూడు; అజాజ్ పటేల్ రెండు వికెట్లు సాధించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ ఆచి తూచి ఆడింది. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. నేడు మొత్తం 57 ఓవర్లు ఆడిన కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. లాథమ్-50, యంగ్-75 పరుగులతో క్రీజులో ఉన్నారు.