ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజే ఇంగ్లాండ్ జట్టు పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆట మొదటి ఓవర్ నుంచే ఇండియా వికెట్ల పతనం మొదలైంది. జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 19 పరుగులు మాత్రమే. జట్టు మొత్తంలో ఇద్దరు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగలిగారు. రోహిత్ శర్మ-19, అజింక్యా రేహానే-18 పరుగులు చేశారు. మొదటి మూడు వికెట్లు అండర్సన్ కు దక్కాయి. దాదాపు రెండేళ్ళ తరువాత మళ్ళీ జాతీయ జట్టులో ఆడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ క్రెగ్ ఓవర్టన్ మూడు వికెట్లతో రాణించాడు. ఓలీ రాబిన్సన్-2; శామ్ కరన్-2 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా జట్టు 40.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్-52, హశీబ్ హమీద్ -60 పరుగులతోను క్రీజులో కొనసాగుతున్నారు.
లీడ్స్ లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. లార్డ్స్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్ డామ్ సిబ్లీ, బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్ లను జట్టులోకి తీసుకుంది.