ఆసియా కప్ సూపర్ 4 దశలో నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఇండియా 101 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్లో బెర్త్ చేజార్చుకున్న ఇండియా నామమాత్రంగా ఆడిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ తో కదం తొక్కాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ స్థానంలో సారధ్య బాధ్యతలు చేపట్టిన కెఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లతో 62 పరుగులతో రాణించాడు. మరోవైపు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో ఆఫ్ఘన్ బ్యాటింగ్ లైనప్ ను తుత్తునియలు చేశాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రాహూల్-కోహ్లీ 119 పరుగులు చేశారు. 62 పరుగులు చేసి రాహుల్ అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. కోహ్లీ-122; రిషభ్ పంత్ 20 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లూ ఫరీద్ అహ్మద్ కే దక్కాయి.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ ను తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో భువీ దెబ్బ తీశాడు. భువీ తన రెండో ఓవర్లో మరో రెండు వికెట్లు తీశాడు. తన నాలుగో ఓవర్లో మరో వికెట్ తీసిన భువీ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకొని టి20 కెరీర్ లోనే అద్భుతమైన స్పెల్ నమోదు చేసుకున్నాడు. 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఇబ్రహీం జార్డాన్- రషీద్ లు ఐదో వికెట్ కు 33; ఆరో వికెట్ కు ఇబ్రాహీ- ముజీబుర్ లు మరో 33 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేయగలిగింది. ఇబ్రహీం జర్డాన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్లలో భువీ ఐదు; ఆర్షదీప్ సింగ్, అశ్విన్, దీపక్ హుడా తలా ఒక వికెట్ పడగొట్టారు.
విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Asia Cup: ఫైనల్స్ కు పాకిస్తాన్