ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో నేపాల్ పై ఇండియా విజయం సాధించి సూపర్ 4 లో అడుగు పెట్టింది. పాకిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఫలితం తేలని సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్ కూ వరుణుడు పలుమార్లు అడ్డు తగిలినా రెండో ఇన్నింగ్స్ కూడా కొనసాగడంతో డిఎల్ఎస్ పధ్ధతి ప్రకారం ఇండియా గెలుపొందింది.
శ్రీలంక లోని పల్లెకేలె ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, నేపాల్ తొలి వికెట్ కు 65 పరుగులు చేసింది. ఇండియా ప్లేయర్స్ ఫీల్డింగ్ పేలవంగా చేసి ఆరేడు క్యాచ్ లు జారవిడిచారు. నేపాల్ ప్లేయర్స్ ఆసిఫ్ షేక్-58; సోంపాల్ కామి-48; కుశాల్ భుర్టెల్-38 పరుగులతో రాణించారు. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు సిరాజ్, జడేజా చెరో 3; షమీ, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి 2.1 ఓవర్లలో 12 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. రెండు గంటల తరువాత ఆటను కొనసాగించి DLS పధ్ధతి ప్రకారం ఇండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 రన్స్ గా నిర్ణయించారు.
ఇండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ వికెట్ నష్టపోకుండా 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74; గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులతో అజేయంగా నిలిచారు.
రోహిత్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.